పుట:సత్యశోధన.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

98

ప్రిటోరియా వెళ్లే దారిలో

అదీగాక మనదేశం తలపాగా మీకు బాగుంటుంది. ఇంగ్లీషు వాళ్ల హేటు పెట్టుకుంటే ఇంగ్లీషు వాళ్ల హోటళ్లలో పనిచేసే నౌకరని అంతా అనుకుంటారు.” అని అబ్దుల్లా నన్ను హెచ్చరించాడు.

ఆయన బోధలో తెలివి, దేశభక్తి వున్నాయి. అందలి తెలివి స్పష్టం, దేశభక్తి లేందే అటువంటి మాటలు నోట రావు. హోటల్లో పనిచేసే వారి యెడ నైచ్యభావం వుండటం వల్ల తేలికభావం వ్యక్తమవుతూ వుంది. గిర్మిటియాలలో హిందువులు, తురకలు, క్రైస్తవులంతా మతం పుచ్చుకున్న గిర్మిటియాల సంతతివారే. 1893 నాటికే వారి సంఖ్య భాగా పెరిగింది. వాళ్లలో చాలామంది దొరల వేషం ధరించి హోటళ్లలో పనిచేస్తున్నారు. అబ్దుల్లాగారు హేటు విషయంలో తేలికగా మాట్లాడిందీ వీళ్ళను గురించే. హోటళ్లలో చేసే సేవకత్వం ఎంతో దైన్యంగా వున్నదన్నమాట. నేటికీ చాలామందికి అట్టి చులకన భావం పోలేదు.

మొత్తం మీద అబ్దుల్లా గారి సలహా నాకు నచ్చింది. యీ తలపాగా వ్యవహారం మొదలైన తరువాత నేను నా పక్షాన్ని సమర్ధిస్తూ పత్రికల్లో వ్యాసం వ్రాశాను. దానితో తలపాగాను గురించి పత్రికల్లో బాగా రగడ జరిగింది. “అన్‌వెల్‌కం విజిటర్” పిలువని పేరంటగాడు అని నాకు పత్రికల్లో పేరు వచ్చింది. తత్ఫలితంగా మూడు నాలుగు రోజుల్లో నా పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది. కొందరు నా పక్షాన్ని సమర్థించారు. కొందరు నా పొగరుబోతుతనాన్ని నోరార తిట్టారు.

నేను దక్షిణ ఆఫ్రికాలో కొంత కాలం తలపాగా తొలగించలేదు. అది నా తల పైనే వున్నది. అయితే తరువాత ఎందుకు తొలగించవలసి వచ్చిందో, నేను ఎందుకు తొలగించానో రాబోయే ప్రకరణాల్లో పాఠకులకు తెలియజేస్తాను.

8. ప్రిటోరియా వెళ్ళేదారిలో

దర్బనులో నివసిస్తున్న భారతీయ క్రైస్తవులతో నాకు పరిచయం ఏర్పడింది. కోర్టులో దుబాసిగా వున్న పాల్ గారు రోమన్ కేథలిక్. మాయిద్దరికీ స్నేహం కుదిరింది. ప్రొటెస్టెంట్‌మిషన్‌లో బోధకుడుగా వున్న సుభాన్‌గ్రాండ్‌ఫ్రే గారితో స్నేహం ఏర్పడింది. వీరు యిటీవలే గతించారు. దక్షిణ ఆఫ్రికా భారతీయ ప్రతినిధి సంఘ సభ్యులుగా నిరుడు ఇండియాకు వచ్చిన జేమ్స్‌గాడ్‌ఫ్రే గారికి వీరు జనకులు. ఇదే విధంగా పార్సీ రుస్తుం గారితోను, అదంజీ మియాఖాన్ గారితోను మైత్రి ఏర్పడింది. వీరిద్దరూ యిటీవలే గతించారు. వ్యాపార వ్యవహారంలో దప్ప యిక ఎన్నడూఒకరి ముఖం మరొకరు చూచుకోని వీరంతా ఏవిధంగా గాఢ మిత్రులైనారో తరువాత వివరిస్తాను.