పుట:సత్యశోధన.pdf/120

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
ఆత్మకథ
97
 

తెలుసుకునేందుకు ఇంకొంచెం లోతుకు వెళ్లాలి. అక్కడికి చేరిన మూడు నాలుగు రోజుల్లోనే అక్కడి భారతీయులు రకరకాలుగా విభాజితులై వున్నారని బోధపడింది. ఒకరు తురక వర్తకులు. వీరు తాము అరబ్బులమని చెప్పుకుంటున్నారు. మరొకరు హిందూ గుమాస్తాలు లేక పారసీ గుమాస్తాలు. పారసీ గుమాస్తాలు మేము పారశీకులం అని చెప్పుకుంటారు. యిక హిందూ గుమాస్తాలు అటూగాక, ఇటూగాక వుండిపోయారు. యీ మూడురకాల వారికీ సాంఘిక సంబంధాలు వున్నాయి. వీళ్లందరినీ మించిన మరో తెగ వున్నది. ఆ తెగలో అరవవారు, తెలుగువారు, ఉత్తర హిందూస్థానమునుండి ఇన్‌డెన్‌చెర్డు కూలికి వచ్చినవారు వున్నారు. ఇన్‌డెన్‌చెర్డు కూలీలంటే అయిదేండ్లు నేటాలు దేశంలో పనిచేసేందుకు అంగీకారం కుదుర్చుకున్న కూలివారన్నమాట. వీరికి గిర్మిటియాలని పేరు. యీ శబ్దం అగ్రిమెంట్ అను పదానికి అపభ్రంశమగు గిర్మిట్ అను పదము నుండి ఉత్పన్నమైనది. పై మూడు తెగలవారు కూడా యీ గిర్మిటియాలతో కూలిపని విషయమైదప్ప వేరు సంబంధం పెట్టుకోరు. దొరలంతా వీళ్లను కూలీలు అని అంటారు. భారతీయులలో ఎక్కువ మంది కూలి చేసుకొనేవారే. ‘సామీ’ అని మరో పేరు కూడా వీళ్లకు వున్నది. సామి అను పదం సామాన్యంగా అరవవారి పేర్లకు చివర వుంటుంది. స్వామిన్ అను సంస్కృత పదానికి యిది వికృతి. సామి అని పిలుస్తున్నావు సరేకాని సామి అంటే అధికారి అని అర్ధం, నేను నీకు అధికారిని కాదు కదా! అందువల్ల ఆ శబ్దం నాకు వాడకు అని చెబుతారు. కొందరు ఏమీ మాట్లాడకుండా వుండిపోతారు. మొత్తంమీద సామి శబ్దం నీచార్ధకంగా ప్రచలితం అయిపోయింది.

నాకు కూలి బారిస్టరు అని పేరు వచ్చింది. వర్తకులకు కూలి వర్తకులని పేరు. ఈ విధంగా కూలీ అంటే అసలు అర్ధంపోయి కూలీలంటే భారతీయులు అను అర్ధం రూఢి అయిపోయింది. తురక వర్తకులకిది గిట్టదు. వాళ్లు మేము అరబ్బులం అనో, లేక మేము బేహారులం అనో చెప్పుకుంటూ వుంటారు. తెల్లవాడు మంచి వాడైతే కూలీ అన్నందుకు క్షమాపణ కోరతాడు.

ఇట్టి పరిస్థితుల్లో నేను తలపాగా పెట్టుకోవడం తప్పుగా భావించబడిందన్న మాట. అందువల్ల ఎందుకొచ్చిన గోల అని భావించి తలపాగా తీసివేసి ఇంగ్లీషు వాళ్ల హేటు పెట్టుకొందామనే నిర్ణయానికి వచ్చాను. దానితో యీ తగాదా పోతుందని అనుకున్నాను.

కాని అబ్దుల్లా సేఠ్‌గారు ఒప్పుకోలేదు. “నీవు యీ పని చేస్తే మరీ ప్రమాదం. నీవు యిట్లా చేస్తే తలపాగా ధరించాలని భావించే వారందరినీ మోసగించినట్లవుతుంది.