పుట:సత్యశోధన.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

95

నా జీవితంలో యిది మూడో అనుభవం. కల్లాకపటం ఎరుగని చిన్నవాళ్లు సాపలిప్తులవుతారు. అయినా నేను లోపలికి వెళ్లడం తప్పుగదా! లోపలికి వెళ్లి ఊరుకోవడం పురుషార్ధం కాదు. ముందే వెళ్లనని చెప్పి బయటనే వుండి వుంటే అది నిజంగా పురుషార్ధం. యీ ఘట్టం భగవంతుని మీద గల నా విశ్వాసాన్ని బాగా పెంచిందని చెప్పగలను. ఈ రేవులో ఏడు రోజులకు పైగా వుండవలసి రావడం వల్ల నేను పట్టణంలో బసచేసి చుట్టుప్రక్కల చూచి వచ్చాను. జాంజిబారు వృక్షాలకు నిలయం. మలబారులా వుంటుంది. అక్కడి చెట్ల ఎత్తును, ఆ చెట్లకు కాచే పండ్ల నిగనిగల్ని చూచి ఆశ్చర్యపడ్డాను.

తరువాత మా ఓడ మొజాంబిక్‌లో ఆగింది. మే నెలాఖరుకు నేటాలు చేరుకున్నాము.

7. కొన్ని అనుభవాలు

నేటాలు దేశానికి రేవు పట్టణం దర్బన్. దానికి పోర్టు నేటాల్ అని కూడా పేరు వుంది. అబ్దుల్లా సేఠ్‌గారు నన్ను తీసుకు వెళ్లేందుకు అక్కడికి వచ్చారు. నేటాలు వాళ్లు చాలామంది తమవాళ్లను తీసుకొని వెళ్లేందుకు వచ్చారు. హిందూదేశస్థుల ఎడ అక్కడి వాళ్లకు ఆదరం వున్నట్లు కనిపించలేదు. అబ్దుల్లా సేఠ్‌ను అంతా తేలికగా చూడటం గమనించాను. ఆ స్థితి చూచి నా ప్రాణం చివుక్కుమన్నది. కాని అబ్దుల్లా సేఠ్‌కు యీ విషయంలో బాగా అనుభవం వున్నట్లనిపించింది. అంతా నా వంక వికారంగా చూచారు. తతిమ్మా హిందూదేశస్థుల కంటే నా వేషం వేరుగాను వింతగాను వుంది. ఫ్రాంక్ కోటు బెంగాలీల పగడీ వంటి తలపాగా ధరించాను.

అబ్దుల్లా గారు నన్ను ఇంటికి తీసుకువెళ్లాడు. తన గదికి ప్రక్కనే వున్న గదిని నా కోసం ఏర్పాటు చేశాడు. నా సంగతి వారికి, వారి సంగతి నాకు తెలియదు. తన తమ్ముడు నా చేతికిచ్చి పంపిన కాగితాలు చదివి కొంత గడబిడ పడ్డాడు. తన తమ్ముడు హిందూ దేశాన్నుండి ఒక తెల్ల ఏనుగును తన వద్దకు పంపించాడని ఆయన భావించాడు. నా వేషభాషలు చూచి దొరలకయ్యేటంత వ్యయం నాకోసం అవుతుందని భావించాడు. అప్పుడు ప్రత్యేకించి నాకు అప్పగించడానికి సరియైన పని కూడా లేదు. వారి వ్యవహారం ట్రాన్సువాలులో సాగుతున్నది. వెంటనే నన్నక్కడికి పంపడంలో అర్థం లేదు. పైగా నా శక్తిని, సామర్థ్యాన్ని, యోగ్యతను గురించి ఆయనకు ఏమీ తెలియదు!