పుట:సత్యశోధన.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

94

నేటాల్

సముద్రంలో పోటు హెచ్చింది. రేవు అల్లకల్లోలం అయింది. మేమెక్కిన నావ మీద బరువు పెరిగింది. ఓడ నిచ్చెనకు మా నావను కట్టి నిలపడానికి వీలు లేనంత బలంగా నీరు పొంగుతూ వుంది. నావ నిచ్చెన దగ్గరకు వెళ్లేసరికి నీటి ప్రవాహం వచ్చి నావను దూరంగా నెట్టివేస్తూ వుంది. ఓడ బయలుదేరుటకు మొదటి ఈల అప్పుడే మోగింది. నాకు తొందర పెరిగింది. కెప్టెను పైనుండి మా అవస్థ చూచాడు. మరో అయిదు నిమిషాలు ఓడను ఆపమని ఆదేశించాడు. నా మిత్రుడొకడు ఓడ దగ్గరగా వున్న ఒక నావవాడికి పదిరూపాయలిచ్చి నన్ను తీసుకురమ్మనగా ఆ నావవాడు దగ్గరకు వచ్చి నన్ను బలవంతాన తన నావలోకి లాక్కున్నాడు. అప్పటికి ఓడ పైకి ఎక్కి వెళ్లే నిచ్చెనను తొలగించి వేశారు. దానితో ఒక మోకు పట్టుకొని నేను పైకి ప్రాకవలసి వచ్చింది. ఓడ వెంటనే బయలుదేరింది.

మొదటి నావలో వున్న సహ యాత్రీకులంతా అక్కడే దిగబడిపోయారు. కెప్టెను మాటలకు గల విలువ ఏమిటో ఇప్పుడు బోధపడింది.

లామూ దాటిన తరువాత మొంబాసా చేరాము. తరువాత జాంజిబారు. అక్కడ ఓడ పదిరోజులు వరకు వుంటుందని, అక్కడ మరో ఓడలోకి మారాలని తెలిసింది.

కెప్టెనుకు నాపై గల ప్రేమ వర్ణనాతీతం అయితే ఆ ప్రేమ మరో వికృత కార్యానికి కారణభూతమైంది. తన వెంట ఆయన నన్ను, మరో తెల్లవాడిని రమ్మన్నాడు. మేము ముగ్గురం ఆయన నావ మీద తీరానికి చేరాం. విహారానికి వెళదాం అన్నాడు. విహారమంటే వాళ్ల భావం ఏమిటో నాకు బోదపడలేదు. ఆ విషయంలో నేనెంత తెలివితక్కువవాడినో ఆయనకు తెలియదు. ఒక తార్పుడుగాడు మా ముగ్గురినీ నీగ్రో స్త్రీల పేటకు తీసుకు వెళ్లాడు. ముగ్గురికి మూడు గదులు చూపించాడు. నేను గదిలో స్త్రీని చూచి సిగ్గుతో కుంచించుకుపోయాను. పాపం, ఆమె నన్ను గురించి ఏమనుకొన్నదో ఆ దేవునికి తెలియాలి. కెప్టెను కొంత సేపైన తరువాత నన్ను పిలిచాడు. నేను వెళ్లిన వాణ్ణి వెళ్లినట్లు బయటకి వచ్చాను. నా చేతగానితనాన్ని అతడు పసిగట్టాడు. మొదట కొంచెం నాకు చిన్నతనంగా వుంది కాని ఆ తర్వాత ఆ విషయం తలచుకుంటేనే భయం వేసింది. ఆడది ఎదురుగా వుంటే జారిపోకుండా వుంచమని భగవంతుణ్ణి ప్రార్థించాను. హృదయ దౌర్బల్యాన్ని తలచుకొని బాధపడ్డాను. ముందే గదిలోకి వెళ్లనని ధైర్యంగా చెప్పి యుంటే బాగుండేది కదా” అని అనుకున్నాను