పుట:సత్యశోధన.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

92

నేటాల్

“ఒక్క సంవత్సరం కంటే ఎక్కువ పట్టదు. రాకపోకలకు మీకు ఫస్టు క్లాసు టిక్కెట్టు యిస్తాం. నూట అయిదు పౌండ్ల సొమ్ము యిస్తాం” అని అన్నాడు. ఇంత కొద్ది సొమ్ము కోసం దక్షిణ ఆఫ్రికా వెళ్లడం బారిస్టరు చేయవలసిన పని కాదు. పైగా దాస్యం చేయాలి. అయినా ఏదో విధంగా యీ దేశాన్ని విడిచి వెళదామనే కోరిక ఎక్కువైపోయింది. క్రొత్త దేశం చూద్దామని, క్రొత్త అనుభవం పొందుదామని అభిలాష కలిగింది. యిదిగాక ఆ నూట అయిదు పౌండ్లు మా అన్నగారికి పంపవచ్చు. కుటుంబ ఖర్చులకు ఆ సొమ్ము వినియోగపడుతుంది. యీ రకమైన అభిప్రాయాలతో యిక మారు మాటాడకుండా సరేనని చెప్పి దక్షిణ ఆఫ్రికా ప్రయాణానికి సిద్ధపడ్డాను.

6. నేటాల్

ఆంగ్ల దేశానికి వెళ్లినప్పుడు కలిగిన వియోగ దుఃఖం దక్షిణ ఆఫ్రికాకు వెళ్లుతున్నప్పుడు నాకు కలుగలేదు. మా అమ్మగారు యిప్పుడు లేరు. నాకు లోకానుభవంతో బాటు సముద్రయానానుభవం కూడా కలిగింది. బొంబాయి రాజకోటలకు తరచుగా రాకపోకలు సాగిస్తూ వున్నాను.

ఈసారి భార్యను విడిచి వెళ్లడానికి కొంచెం కష్టం కలిగింది. ఇంగ్లాండు నుండి వచ్చిన తరువాత ఒక పిల్లవాడు పుట్టాడు. మా ప్రేమ యింకా కామవాంఛ నుండి విడివడలేదు. కాని మెల్లమెల్లగా మెరుగుపడసాగింది. ఇంగ్లాండు నుండి వచ్చిన తరువాత మేము కలిసి కొద్ది కాలం వున్నాము. ఆమెకు ఉపాధ్యాయుడనై ఏదో విధంగా కొన్ని సంస్కారాలు నేర్పడానికి పూనుకున్నాను. ఆ శిక్షణ పూర్తికావాలంటే ఇద్దరం కలిసి వుండటం అవసరం అని అనుకున్నాము. కాని దక్షిణ ఆఫ్రికాకు వెళ్లే మహోత్సాహంలో వియోగ దుఃఖం అంతగా బాధించలేదు. ఒక సంవత్సరంలో మళ్లీ కలుద్దామని చెప్పి భార్యను ఊరడించి రాజకోట నుండి బొంబాయికి బయలుదేరాను.

దాదా అబ్దుల్లా కంపెనీ వారి ఏజంటు ద్వారా టిక్కెట్టు రావాలి. ఓడలో కాబిన్ ఖాళీగా లేదు. యిప్పడు బయలుదేరి వెళ్లకపోతే ఒక మాసం రోజులు బొంబాయిలోనే వుండాలి. మేము మొదటి తరగతి టిక్కెట్టు కోసం చాలా ప్రయత్నం చేశాము. కాని లాభం లేకపోయింది. మీరు వెళ్లదలచుకుంటే డెక్ మీదనే వెళ్ళాలి. మొదటి తరగతి భోజనం మాత్రం ఏర్పాటు చేశాము. ఆ ఏజంటు చెప్పాడు. అవి నా మొదటి తరగతి ప్రయాణం రోజులు. బారిస్టరు డెక్ మీద ప్రయాణం చేయడమా? అందుకు నేను అంగీకరించలేదు. మొదటి తరగతి టిక్కెట్లు సంపాదించాలని నేను నిర్ణయించుకున్నాను,