పుట:సత్యశోధన.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

91

కొన్ని అధికారాలు సంపాదించి పెట్టే ఉద్యోగం ఒకటి ఉంది. ఇది కాక మేరులు అను ఒక జాతివారి మీద విధించబడ్డ హెచ్చు పన్నులను గురించి కూడా ఆ రాష్ట్రాధికారిని కలవవలసిన అవసరం ఏర్పడింది. అతడు హిందువే. కాని దురహంకారంలో తెల్లదొరల తాత అని తెలిసింది. అతడు సమర్థుడు. కాని అతడివల్ల రైతులకు ప్రయోజనం ఏమీ కలుగలేదు. నేను సంస్థానాధిపతికి కొన్ని కొత్త అధికారాలు సంపాదించి పెట్టగలిగానే గాని మేరులకు మేలు చేయలేకపోయాను. వారి విషయమై పూర్తిగా శ్రద్ధ వహించలేదని అనిపించింది.

అందువల్ల యీ వ్యవహారంలో కూడా నిరాశపడ్డాను. నా క్లయింట్లకు న్యాయం జరగలేదు. న్యాయం కలిగించగల సాధనం నా దగ్గర లేదు. చివరికి పొలిటికల్ ఏజంటుకో లేక గవర్నరుకో అర్జీ పెట్టుకోవాలి. అలా చేస్తే దీనితో మాకేమీ సంబంధం లేదని వాళ్లు త్రోసి పుచ్చేవాళ్లు, చట్టం ఏమైనా వుంటే అవకాశం వుండేది. కాని యిక్కడ దొరగారి మాటే చట్టం, అదే శాసనం.

ఈ విధంగా నేను ఉక్కిరి బిక్కరికావలసి వచ్చింది. ఇంతలో పోరుబందరు నుండి మేమన్ దుకాణం వారు మా అన్నగారికి జాబు వ్రాశారు. “మాకు అక్కడి కోర్టులో పెద్ద దావా వున్నది. అది నలభైవేల పౌండ్ల దావా. చాలా కాలాన్నుండి నడుస్తున్నది. మేము అందుకు పెద్ద వకీళ్లను, బారిష్టర్లను పెట్టాము. మీ తమ్ముణ్ణి పంపితే అతడు మాకు ఉపయోగపడతాడు. అతడికీ ఉపయోగం కలుగుతుంది. అతడు క్రొత్త దేశం చూస్తాడు. క్రొత్త అనుభవాలు పొందుతాడు” అని ఆ జాబులో వారు వ్రాశారు.

ఈ విషయం మా అన్నగారు నాకు చెప్పారు. అక్కడ నేను చేయాల్సిన పనేమిటో తెలియదు. అయితే వెళ్లాలనే కోరిక కలిగింది. “దాదా అబ్దుల్లా అండ్ కో లో భాగస్వామియగు సేఠ్ అబ్దుల్ కరీం జావేరీ గారికి (తరువాత గతించారు) మా అన్న నన్ను చూపించారు. ఆయన యిదేమి కష్టం కాదు అని నచ్చచెప్పి “అక్కడ మాకు పెద్ద పెద్ద తెల్లవాళ్లు మిత్రులుగా వున్నారు. వారితో మీకు పరిచయం కలుగుతుంది. దుకాణంలో మీరు మాకు ఉపయోగపడతారు. మా వ్యవహారమంతా ఇంగ్లీషులో పుంటుంది. దానికి మీరు పనికి వస్తారు. ఆ దేశంలో వున్నంత కాలం మీరు మాకు అతిథులు. అందువల్ల విడిగా మీకు ఖర్చు ఏమీ ఉండదు” అని చెప్పాడు,