పుట:సత్యశోధన.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

88

మొదటి ఎదురు దెబ్బ

వుంటూ రాణాగారికి కుట్ర సలహా యిచ్చాడని మా అన్నగారి మీద నేరం మోపబడింది. అది పొలిటికల్ ఏజంటుదాకా వెళ్లింది. ఆయన మా అన్నగారి మీద కక్ష కట్టాడు. నేను ఇంగ్లాండులో వున్నప్పుడు అతనికి నాకు పరిచయం వుండేది. స్నేహం కూడా వుండేది. ఆ స్నేహాన్ని ఉపయోగించి అతనికి తనపై గల కక్షను పోగొట్టేలా చేయమని మా అన్నగారు నన్ను కోరారు. నాకు యిట్టి వ్యవహారం నచ్చదు. ఎక్కడో ఇంగ్లాండులో యాదృచ్ఛికంగా ఏర్పడిన పరిచయాన్ని, స్నేహాన్ని యీవిధంగా ఉపయోగించడం నాకు యిష్టం లేదు. నిజంగా మా అన్న దోషం చేసియుంటే యీ నా ప్రయత్నం వల్ల ఫలితం ఏముంటుంది? దోషం చేయకపోతే నిర్భయంగా రాచబాటన అర్జీ పంపి విజయం సాధించవచ్చు కదా! మా అన్నగారు యిందుకు అంగీకరించలేదు. “నీకు కఠియావాడు తెలియదు. నీకు ప్రపంచ జ్ఞానం తక్కువ. యిక్కడ పలుకుబడికే ప్రాధాన్యం. నేను నీకు సోదరుణ్ణి. ఆ తెల్లదొర నీకు స్నేహితుడు. అతడికి నచ్చచెప్పి నాపై గల అతని కక్షను తొలగింపచేయడం నీ ధర్మం” అంటూ ఆయన వత్తిడి చేశారు.

ఇక నేను కాదనలేక ఆ దొరను కలవడానికి నిర్ణయించుకున్నాను. అతని దగ్గరకు వెళ్లి, యీ విషయం చెప్పడం నాకు తగినపని కాదని తోచింది. అయినా తప్పలేదు. ఆయన దగ్గరకు జాబు పంపి కలుసుకునేందుకు సమయం కోరాను. ఆయన యిచ్చిన సమయానికి వెళ్లి ఆయనను కలిసి గతంలో యిరువురి స్నేహాన్ని గురించి జ్ఞాపకం చేశాను, కాని కఠియావాడుకు, ఇంగ్లాండుకు ఎంతో భేదం కనబడింది. సెలవులో వున్న ఉద్యోగి వేరు. పనిలో వున్న ఉద్యోగి వేరు, ఆ పొలిటికల్ ఏజంటు మా స్నేహాన్ని అంగీకరించాడు. కాని మా అన్నగారి విషయం ఎత్తేసరికి ఆతడు కరుకు బారాడు. అదా విషయం! ఆ స్నేహాన్ని పురస్కరించుకొని అనుచిత లాభం పొందాలని చూస్తున్నావా? అన్న భావం ఆయన కండ్లలో నాకు గోచరించింది. అయినా నా పాట నేను మొదలు పెట్టాను. దానితో ఆ దొర చిరాకుపడి “మీ అన్న చాలా కుట్రదారు. నేనేమీ వినను. నాకు అవకాశం తక్కువ. ఏమైనా చెప్పుకోవాలనుకుంటే మీ అన్ననే వచ్చి చెప్పుకోమను అని అన్నాడు. నిజానికి ఆ సమాధానం నాకు చాలు. నేను చెప్పిన దానికి సరియైన సమాధానం యిచ్చినట్లే గదా! కాని నా అవసరం నాది. నేను మానకుండా యింకా చెబుతూనే వున్నాను. ఆయన లేచి “ఇక వెళ్లు” అని అన్నాడు.

నా మాటలు పూర్తిగా వినమని పట్టుబట్టాను. దానితో అతనికి కోపం వచ్చింది. నౌకరును పిలిచి “వీనికి త్రోవ చూపించు” అని ఆదేశించాడు. నేను గొణుగుతూ