పుట:సత్యశోధన.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

87

కాని నేను మాత్రం జబ్బు పడలేదు. డబ్బు రావడం ప్రారంభమైన తరువాత కూడా నేను నడిచే వెళుతూ వున్నాను. ఆనాటి ఆ అలవాటు యొక్క సత్ఫలితం నేను యీనాటికీ పొందుతున్నాను.

4. మొదటి ఎదురుదెబ్బ

బొంబాయి వదిలి రాజకోట చేరాను. ఒక ఆఫీసు పెట్టుకున్నాను. యిక్కడ పని బాగానే సాగింది. అర్జీలు, దరఖాస్తులు వగైరాలు వ్రాసి పెట్టడం వల్ల నెలకు మూడొందల రూపాయలు రాసాగాయి. అయితే యీ పని దొరకటానికి కారణం నా యోగ్యత కాదు. మా అన్నగారు, మరో వకీలు ఉమ్మడిగా పనిచేస్తున్నారు. ఆ వకీలుకు ప్రాక్టీసు ఖాయం అయిపోయింది. అవసరమైనవీ, ముఖ్యమైనవీ అని తాను భావించిన అర్జీలు పెద్ద బారిష్టర్ల దగ్గరికి అతడు పంపేవాడు. బీద క్లైంట్ల అర్జీలు మాత్రం నేను వ్రాసేవాణ్ణి.

“ఎవ్వరికీ సొమ్ము యివ్వను అని బొంబాయిలో నేను పట్టుబట్టానే కాని, రాజకోటలో మాత్రం ఆ విషయమై కొంత మెత్తబడవలసి వచ్చింది. యీ రెండు చోట్ల వ్యవహారం వేరని విన్నాను బొంబాయిలో దళారులకు సొమ్ము చెల్లించాలి. యిక్కడ వకీళ్లకు సొమ్ము చెల్లించాలి. రాజకోటలో ప్రతి వకీలు యిలా చెప్పారు! చూడు! నేను మరో వకీలుతో భాగస్వామిని కదా! నీవు చేయగల పనులు నీకు వచ్చేలా నేను చూడగలను. అట్టి మనిద్దరం అవిభక్తులం. కనుక నీకు వచ్చిన ఫీజంతా మన ఉమ్మడి సొమ్ము! అంటే అందులో నాకు భాగం వున్నట్లే! మరి నా భాగస్వామి అయిన వకీలు విషయం యోచించు. యీ కేసులు మరో వకీలుకిస్తే అతడికి రావలసిన సొమ్ము రాదా?

మా అన్నగారి మాటలకు నేను లొంగిపోయాను. బారిష్టరు వృత్తిలో వుంటూ యిట్టి పట్టుపట్టరాదని భావించాను. నాకు నేను సరిపుచ్చుకున్నానే గాని యిది ఆత్మవంచనే. అయితే ఏ కేసుల్లోను ఎవ్వరికీ రుసుం యివ్వలేదనే గుర్తు.

ఈ విధంగా జీవితం సాఫీగా వెళ్లబారుతూ వుండగా నా జీవితానికి మొదటి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తెల్ల అధికారుల ప్రవర్తనను గురించి విన్నానే గాని అట్టి అనుభవం నాకు అప్పటివరకు కలుగలేదు.

చనిపోయిన పోరుబందరు రాణాగారు గద్దె ఎక్కే పూర్వం నాటి మాట. ఆయనకు మా అన్నగారు మంత్రిగాను, సలహాదారుగాను వుండేవారు. ఉద్యోగంలో