పుట:సత్యశోధన.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

85

ఈ వయసులోనే మమీబాయి అను ఆమె కేసు ఒకటి తీసుకున్నాను. అది స్మాల్ కాజుకు సంబంధించినది. మధ్య దళారి కొంత సొమ్ము కమీషను యిమ్మని అడిగాడు. నేను పైస కూడా యివ్వనన్నాను. “ఫలానా పెద్ద లాయరు నెలకు మూడు నాలుగు వేల రూపాయలు సంపాదిస్తున్నాడు ఆయనే కమీషను సొమ్ము యిస్తాడు కదా!” “ఆయనతో నాకు పోటీ లేదు. నాకు మూడు వందల రూపాయలు చాలు. మా నాయన అంతకంటే ఎక్కువ సంపాదించలేదు.” “అది ఇక్ష్వాకుల కాలం. బొంబాయిలో ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. ప్రపంచాన్ని అర్ధం చేసుకొనిమెలగడం మంచిది.” కాని నేను మెత్తబడలేదు. అయినా ఆమె కేసు నాకే వచ్చింది. అది చాలా తేలిక వ్యవహారం. ముప్పది రూపాయల ఫీజు తీసుకున్నాను. ఒకరోజు కన్న ఆ కేసుకు ఎక్కువ సమయం పట్టదు.

స్మాల్ కాజ్ కోర్టులో ఇదే నాకు మొదటి కేసు. ‘హరిః ఓమ్’ అన్న మాట. నేను ప్రతివాది పక్షం. అందువల్ల వారి తరఫు సాక్షుల్ని క్రాస్ చేయాల్సి వచ్చింది. కోర్టులో లేచి నుంచున్నాను. గుండె దడదడలాడింది. తల తిరిగిపోయింది. కోర్టంతా తిరిగిపోతున్నట్లనిపించింది. ప్రశ్నలు అడుగుదామంటే నోరు తెరుపుడు పడలేదు. జడ్జి నవ్వి వుంటాడు. తోటి వకీళ్లకు కూడా నవ్వు వచ్చి వుంటుంది. కాని నేను యిదంతా పట్టించుకునే స్థితిలో లేను. నేను కుర్చీలో కూర్చుండిపోయాను. ఏజంటును పిలిచి “ఈ కేసును వదిలేస్తున్నాను. మరొక పటేలును పెట్టుకోండి. నాకిచ్చిన రుసుం ముప్పది రూపాయలు తిరిగి ఇచ్చివేస్తాను” అని చెప్పి సొమ్ము యిచ్చి వేశాను. వాళ్లు యాభై రూపాయలకు పటేలును కుదుర్చుకున్నారు. ఆ కేసు ఆయనకు బహు సులభం.

నేను గబగబా యింటికి వెళ్లాను. ఆ కేసు ఏమైందో నాకు తెలియదు. నాకు మాత్రం చాలా సిగ్గువేసింది. యిక కేసులు తీసుకోకూడదని నిర్ణయానికి వచ్చాను. దక్షిణ ఆఫ్రికా పోనంతవరకు ఆ కేసుల వైపు చూడలేదు. యీ విధమైన నిర్ణయం మంచిదికాదు కాని ఆ సమయంలో అది మంచిదే అయింది. ఓడిపోయేందుకై నాకు ఎవ్వడూ కేసులు యివ్వడుకదా!

బొంబాయిలో నా దగ్గరికి మరో కేసు వచ్చింది. అయితే అందు కేవలం అర్జీ మాత్రమే వ్రాయాలి. పోరుబందరులో నిరుపేదయగు ఒక తురకవాని భూమిని సంస్థానం వారు జప్తు చేశారు. మా తండ్రి గారి గౌరవాన్ని బట్టి అతడు నా సాయం కోరాడు. అతని వాదంలో బలం లేదు. అయినా అర్జీవ్రాసి యిచ్చేందుకు అంగీకరించాను.