పుట:సత్యశోధన.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

మొదటి కేసు

మడ్డి గుడ్డలు విడవననీ, అన్నం పరిశుభ్రంగా వుంచననీ రవిశంకరుని ప్రతిజ్ఞ. దాన్ని మాత్రం జాగ్రత్తగా కాపాడుకొంటూ వున్నాడు, బొంబాయిలో నాలుగైదు మాసాల కంటే ఎక్కువకాలం వుండటానికి వీలుపడలేదు. అక్కడ ఖర్చు ఎక్కువ, రాబడి తక్కువ.

ఈ విధంగా సంసార సాగరంలో ఈత ప్రారంభించి వకీలు వృత్తి మంచిది కాదనే నిర్ణయానికి వచ్చాను. యిది కేవలం చూపుడు గుర్రమే. పైన పటారం, లోన లొటారం. ఇక నా కర్తవ్యం ఏమిటా అని ఆలోచనలో పడ్డాను.

3. మొదటి కేసు

నేను బొంబాయిలో ఒక వంక హిందూ లా చదవడం, మరోవంక భోజనం విషయంలో ప్రయోగాలు చేయడం ప్రారంభించాను. మిత్రుడు వీరచంద్‌గాంధీ నాకు సహకరించాడు. మా అన్నగారు నాకోసం కేసుల్ని తీసుకువచ్చేందుకు కృషి చేయసాగారు.

హిందూ లా చదవడం విసుగు పని. సివిల్ ప్రొసీజరు కోడ్ నాకు నడవలేదు. ఎవిడెన్సు ఆక్టు విషయం వేరు. వీరచంద్ గాంధీ సొలిసిటర్ పరీక్షకు చదువుతూ వున్నాడు. అతడు బారిస్టర్ వృత్తిని గురించీ, వకీళ్లను గురించి రకరకాల గాధలు చెబుతూ వుండేవారు. లా శాస్త్రంలో అగాధమైన విజ్ఞానమే ఫిరోజ్ షా గారి యోగ్యతకు నిపుణతకు కారణం. ఆయనకు ఎవిడెన్సు ఆక్టు పూర్తిగా బట్టీ. 32వ సెక్షనులోని ప్రతి కేసు ఆయనకు కంఠోపాఠం. బదరుద్దీన్ తయాబ్జీగారి వాదనా పటిమ చూచి జడ్జీలు నివ్వెరబోయేవారు. యిట్టి అతిరధుల మహారథుల గాధలు విని నా గుండె నీరైపోతూ వుండేది.

ఇంకా “కొత్త బారిస్టర్లకు అయిదారు మాసాల పాటు పని ఏమీ వుండదు. యిదిఅందరికీ తెలిసిన విషయం. అందువల్లనే నేను సొలిసిటర్ జనరల్ కోర్సు చదువుతున్నాను. నీవు యింకా మూడు నాలుగు మాసాలలో డబ్బు సంపాదించగలిగితే అదృష్టమే.” అని అన్నాడు. నెలనెలకు ఇంటి ఖర్చు పెరిగిపోతున్నది. ఇంటి బయట బారిష్టరు అని బోర్డు కట్టి, ఇంటి లోపల కూర్చొని బారిష్టరు వృత్తికి కృషిచేయడం నాకు నచ్చలేదు. యీ విధమైన పరిస్థితి వల్ల గ్రంథపఠనంలో మనస్సు లీనంకాలేదు. ఎవిడెన్సు ఆక్టుమీద బలవంతాన ఆసక్తి పెంచుకున్నాను. మైస్‌గారు రచించిన “హిందూలా” ను ఉత్సాహంతో చదివాను. కాని కోర్టులో వాదించేందుకు గుండె చాలలేదు. యిక నా కష్టం ఆ దేవుడికే ఎరుక. అత్తగారింటికి వచ్చిన కొత్త కోడలికంటే నా పని కనాకష్టమైపోయింది.