పుట:సత్ప్రవర్తనము.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ

సత్ప్రవర్తనము.


మొదటి ప్రకరణము

సంపదల కునికిపట్టు జంబూద్వీపము. దానివంటి దదే యని యెల్లరు గొనియాడుదురు. హిమాలయమునకు దక్షిణ భాగమున నాద్వీప ముండును. నాలుగుదెసల సముద్రము లుండిన ద్వీపమందురు. ఈయది ద్వీపకల్ప మనంబడును. ఉత్తరపుదిక్కున సముద్రము లేదు. కాని హిమాలయమున్నది. జంబూవృక్షము (నేరేడుచెట్టు) ఉత్తరభాగమున సీమగా నున్నందున జంబూద్వీపమను పేరు కలిగెనందురు. ఏకారణమున నైననేమి లోకప్రఖ్యాతి నీపేరు గాంచెననుట నిర్వివాదము. ఈద్వీపమున ననేకదేశములు గలవు. అందు నాంధ్రదేశ మొక్కడు. ఆంధ్రదేశమునకు సంధ్రదేశమను నామాంతరము కలదు. అది కటకమను నగర ముత్తరపుటెల్లగా, శ్రీశైలమను మహాక్షేత్రము దక్షిణపు టెల్లగా గలది. అందు గౌతమీ కృష్ణానదులు ప్రవహించుచు సాగరమునఁ గలియుచున్నవి. ఈయవియే ప్రధాన పుణ్యనదులు, గౌతమీనది యేడుభాగములు సాగరమున సంగమించును. ఆభాగము సప్తగోదావరీ తీర మనఁబడుచున్నది.