పుట:సకలనీతికథానిధానము.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

సకలనీతికథానిధానము


క.

యతివరుఁడు రాజయోగ
స్థితినాథుఁడుగాక యిట్టిక్షితినాథుండే
మతి బరికింప గననియా
క్షితిపతి దీవించి చనియె స్వేచ్ఛాగతులన్.

55


వ.

అని నారదుండు యింక నొక్కయద్భుతంబు వినుమని యబ్బలీంద్రున కిట్లనియె.

56


క.

నరుఁ డెట్టికులజుఁ డైనన్
హరిచిహ్నలు దాల్చి నాట్యమాడిన నైనన్
హరి యుద్ధరించు వారికి
శరణంబై రాజ్యభోగ సంపదలిచ్చున్.

57


వ.

అట్లు గావున.

58


క.

మానవనాథుండు బృహ
త్సేనుండనువాఁడు తపము సేయగ శివుఁ డా
ధ్యానమున నిలిచి పలికెన్
భూనాయక! వరము వేడు పొసగఁగ నిత్తున్.

59


ఆ.

అనిన సంతతియును నాహవజయమును
కోరుటయును నొక్కకొమ్మ పుట్టు
దివ్యపురుషుఁ డట్టి తెఱవకై తనుదాన
వచ్చి పొంది నీకు వరదుఁ డగును.

60


వ.

అతనివలన నీకు శత్రుజయంబును కులాభివృద్ధియు నగునని వరం బిచ్చి శంకరుం డరిగిన ప్రతాపవిషయాధీశ్వరుం డటువంటికన్యకం గాంచి యది యౌవనవతియైన హరుం డానతిచ్చిన దివ్యపురుషుం డెన్నఁడు వచ్చునొకో యని సౌధాగ్రంబున నిడి యుండు నంత.

61