పుట:సకలనీతికథానిధానము.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

సకలనీతికథానిధానము


క.

కోపించిన పులి దిగువం
జూపట్టగమీద నెలుగు నుడియఁగ నుభయా
టోపముల కులికి వడఁకెను
భూపజుఁ డడకత్తి లోనిపోకయు బోలెన్.

27


వ.

అంత క్రిందనున్న పులి మీఁదనున్న భల్లూకంబున కిట్లనియె.

28


క.

మనుజుం డస్థిరచిత్తుఁడు
తనునమ్మినవారి జెఱుచుఁ దరియగువేళన్
మనుజుండు పాపకర్ముఁడు
మనుజునివర్తనము లెల్ల మాయలు సుమ్మీ.

29


వ.

అని బోధించి యమ్మనుష్యునిం బడద్రోయుమనిన నయ్యచ్ఛభల్లం బిట్లనియె.

30


క.

తనునమ్మి శరణుజొచ్చిన
మనుజుని రిపునైన దుష్టమానసునైనన్
మనమున నొండు దలంపక
మనుపుటయే ధర్మ మనుచు మనుపుదు రార్యుల్.

31


వ.

అట్లుగావున నితం డెట్టివాఁడైన బడద్రోయనని నిద్రాలసుండైన యారాచకొమరనిం దొడమీఁద నిడుకొని. ...........నిద్రవోయి మేలుకొనిననంత భల్లూకం బతని హృదయం బెఱుఁగదలచి నిద్రించునదియుం బోలె నారాచకొమరునితొడ దలయంపిగా గన్నులు మూసికొన నాశార్దూలంబు రాచకొమరున కిట్లనియె.

32


క.

మృగములకును మానవులకు
నగునే చెలికార మెట్టియవసర మైనన్
మృగము (నరుమీఁద) దెగునట
మృగముపయి న్నరుఁడు దెగునిమిత్తము లేకే.

33