పుట:సకలనీతికథానిధానము.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

65


ఆ.

ఆత్రివేణి గూలె నంత మూడవదియు
నాత్మభర్త కళల నధికుఁ డగుచు
జేరి మొగముఁ జూచువారెల్ల కవులుగా
గోరి యాత్రివేణి గూలుటయును.

8


క.

ఈముండలు మువ్వురకు
న్నే మగడం గాఁగవలయు నిహమున నని తా
నాముండియందు గూలుచు
భూమిపయిన్ ధరణి యేలె భోజుం డగుచున్.

9


వ.

అట్లు చెప్పి యిట్లనియె.


ఉ.

మానవలోకనాథుఁ డసమానచరిత్రుఁడు నందుఁ డంగనా
మానసవర్తియై విబుధమంత్రులకున్ గొలువీక యెప్పుడున్'
భానుమతీకపోలకుచభారముఖోరువిలోలనేత్రస
న్మానమనస్కుఁడై ధరణిమండల మేలుచు నుండె నంతటన్.

10


వ.

ఇవ్విధంబున స్త్రీలోలుండై భూపరిపాలనంబునం బ్రమత్తుండై యున్న నతనికి బహుశ్రుతుం డిట్లనియె.

11


ఆ.

జాతిసంకరములు జరగంగ నీయక
భూతలంబు జనులరీతు లెఱిఁగి
శత్రుమిత్రనృపతిచర్యలు పరికించి
ధరణి యేలవలయు నరవరుండు.

12


క.

లోలాక్షులు మనసీయరు
శ్రీలక్ష్మీస్థితులు చెదరు చేరిన మనుజుల్
వేళగని వెళ్ళఁజూతురు
స్త్రీలోలుఁడు పాపి యనుచుఁ జెప్పుదు రార్యుల్.

13


వ.

అని మంత్రి హితంబు చెప్పిన నిట్లనియె.

14