పుట:సకలనీతికథానిధానము.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

23


క.

ఆతటమున నొకవిప్రుఁడు
శ్రీతరుఫలహోమమొకటి చేయుచునుండెన్
భూతలనాథుఁడు డగ్గరి
యాతని నీవేల వ్రేల్చెదని యడగుటయున్.

127


వ.

ఆతం డిట్లనియె.

128


క.

శతహాయనంబు లయ్యెను
క్షితివర యీరీతి వ్రేల్మి సేయుదు దుర్గా
వ్రతినై యుండుట పర్వత
సుతయును ననుచాలుననక చూచుచునుండెన్.

129


ఆ.

అనిన నతని నుడుగుమని యొక్క మాలూర
ఫలముతేనెఁ దోఁచి పవనసఖుని
యందు వ్రేల్చుటయును నంబిక మెచ్చక
యున్న [1]తేజఖడ్గ ? మొకటియెత్తి.

130


చ.

తనతల ద్రించి వ్రేల్తునని తత్పరతన్ ఝళిపించు సాహసుం
గనుగొని దుర్గ హస్తమున కత్తికరంబు గ్రహించి వల్లువ
ల్దనిన మహీసురోత్తము ప్రయాసము వ్యర్థముగాకయుండ గో
రినవర మిమ్ము శీతలగిరిప్రభుపుత్రిక! యన్న నిట్లనున్.

131


తే.

చిత్తశుద్ధి లేక చేసిన జపమును
తపము హోమవిధియు దానములును
దేవతార్చనములు భావింప నిష్ఫల
మట్లు గానవలయు నాత్మశుద్ధి.

132


వ.

కావున విప్రుండు శ్రద్ధాహీనుండు వీనికి నేల ఫలించు నిన్ను మెచ్చితి వర మిచ్చెద నడుగుమనిన విప్రుండుగోరిన వరం బిప్పించి యుజ్జయనిపురంబున కరిగె నట్లు గావున.

133
  1. జేతిఖడ్గ మొకటి యెత్తి