పుట:సకలనీతికథానిధానము.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

258

సకలనీతికథానిధానము


గీ.

ఈతఁ డుపకారి గాని యహితుఁడు గాఁడు
వధ యొనర్పకుఁడని దివ్యవాణి పలుకఁ
గాచి రటుగాన వ్యాళసంగతము సింహ
కంఠవసతియు గాదె భూకాంతమైత్రి.

41


వ.

అనుటయు నక్కళింగదత్తతనూభవ యిట్లనియె.

42


సీ.

యజ్ఞస్థలంబను నగ్రహారమునందు
        ధనహీనుఁడగు విప్రతనయుఁ డొకఁడు
కట్టెలు మోపుగాఁ గట్టి యెత్తగలేక
        పడి వ్రణమైనఁ జేపట్టి యొక్క
యెడ బిశాచమువచ్చి యేమైన మందిచ్చి
        పుండు మాన్చిన విప్రపుత్రకుండు
హితబుద్ధి వాటింప నింటివారికి నెల్లఁ
        బుండ్లు గావించియు బూమె చేసి


కూఁతు గైకొని పైశాచకులముఁ గలసి
చనియె నటుగాన రాజపిశాచములకు
నంతరము లేదు నమ్మిన యట్టివాని
భంగపరతురు చెఱుతు రేపట్టులందు.

43


వనమయూరము:

ఈగతి మహీశసుత యిష్టసుఖగోష్ఠిన్
సాగతము చూప మయసంభవయు నంతన్
నాగధర కేగె నరనాథసుతయున్ వై
యోగము సహింపక సుఖోఝ్ఝితము నొందెన్.

44


ఉ.

అంతఁ గళింగదత్తుఁడు నిజాత్మజ దానవపుత్రికాసమా
క్రాంతమనస్క-యై రుచులు గానక మేను కృశించుచున్న భూ
కాంతుఁడు వైద్యులం బనుపఁ గామిని హస్తము చూచి మోహవి
భ్రాంతియకాన రోగమని పల్కిన గూఁతురు జెప్ప నంతయున్.

45