పుట:సకలనీతికథానిధానము.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

257


క.

అన్యు లెఱుంగకయుండన్
గన్యాసఖ్యంబు మనకుఁ గావలయుఁజుమీ!
అన్యాయం బంతఃపుర
విన్యాసము యోగికైన విమలేందుముఖీ!

37


సీ.

పుష్కరావతి యనుపురమున గూఢసే
        నాఖ్యుండు నృపసుతుం డందు నొక్క
యూరుజతనయుండు కూరిమిచెలి గాఁగ
        దాదితో రాఁగయాత్రలకు నరిగి
యొకచోటఁ బరిజనయుక్తుఁడై వసియించి
        దాది వీక్షించి మోదమున నొక్క
కథ చెప్పుమని నిద్ర గదిరినఁ గనుమూయ
        దాదియు నిద్రించెఁ తత్క్షణమున


విగతనిద్రుండు గోమటి వినుచునుండ
దివ్యకాంతలు పలికిరి దివి వసించి
కథలు వినవచ్చితిమి మనఃకౌతుకమున
నకట నిద్రించెదరు మూఢులట్ల వీరు.

38


వ.

ఒక్కహారంబునుపలంబు లుడుపదంబునం బొడగట్టెడు నవి గైకొన్నను క్షుతశతంబును విన్నను రాజపుత్రుండు మృతుండగునని యెరిగిన నిద్రారహితుఁడైన వైశ్యకుమారుండు విని ప్రభాతంబున రాజపుత్రు నవి యంటనీయక కొని చని శ్వశ్రూగృహంబున నునిచి శతక్షుతప్రతీకారార్థంబు చింతింపుచుం బ్రచ్ఛన్నుండై యారాత్రి యచట వసియించునంత.

39


క.

క్షుతశతములకును దీవన
లతిశయముగ నొసఁగి కల్యమగుటయు వెడలెన్
క్షితిపతిసుతుఁ డంతఃపుర
గతుఁడై వైశ్యుండు ద్రోహి ఖండింపుఁ డనన్.

40