పుట:సకలనీతికథానిధానము.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

సకలనీతికథానిధానము


జ్జనపతి ఫలము మహత్త్వము
విని మోహపుదేవి కిచ్చె వెలఁదియు దానిన్.

81


ఆ.

కోరికలరనిచ్చె గుఱ్ఱాలకాపరి
కతఁడు లద్దిదుడుచు నతివ కిచ్చె
గొల్ల కిచ్చె నదియు గొల్లయునున్ బేఁడ
మోసి కుప్పవేయుదాని కిచ్చె.

82


వ.

అదియును శూర్పపూరితంబైన గోమయంబుపై నిడుకొని తెచ్చు సమయంబున.

83


తే.

భర్తృహరివెంటవోయి యావనమునందు
నరుగుదెంచుచు నగ్గోమయంబుమీఁది
విశ్రవరలబ్ధమైన యుర్వీజఫలము
కాంచి యద్దాసి నడిగి తత్క్రమము దెలిసి.

84


క.

సరసిజనేత్రల శీలము
నరనాథులకృపయు గ్రూరనాగంబుల త
త్పరతయు మిథ్యావచనుల
వరములు దలపంగ నీటివ్రాతలు గావే.

85


వ.

అదియునుంగాక.

86


క.

మాయయు నసత్యవాక్యము
కాయకమును ? కోపగుణము క్రౌర్యము శీలా
సాయము మూర్ఖత్వంబును
తోయజదళలోచనలకు దోడజనించున్.

87


ఉ.

ఒక్కనిఁ జూచు వేఱొకని నొల్లక మారుమొగంబు పెట్టు నొం
డొక్కని కాస చూపు మఱియొక్కనితో రమియించు వేడ్కతో
నొక్కని గౌఁగిలించు తలపొక్కని పైనిడి తాల్మిదూలు నే
దిక్కున బట్టిచూడ సుదతీజనవర్గము నమ్మవచ్చునే.

88