పుట:సకలనీతికథానిధానము.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

201

చతుర్థాశ్వాసము


క.

అక్షరమొక్కటి యైనను
శిక్షించిన గురువు సేవ సేయని మనుజుం
డక్షణమ శునకయోనుల
నక్షీణతఁ బుట్టి మాలఁడై జనియించున్.

74


వ.

మఱియు సునీతి వర్మ యిట్లనియె.

75


క.

ఏపాటిమేలు దొరకిన
నాపాటికి సంతసింతు రార్యజనంబుల్
కాపురుషలోభి మానవు
లాపోవక మఱియు మఱియు నాసింతు రిలన్.

76


క.

తేలునకు తోఁక విషమగు
వ్యాలమునకుఁ బండ్ల విషము వనమక్షికకున్
బోలంగ శిరము విషమగు
కాలినఖలునకును విషము కాయంబెల్లన్.

77


క.

వ్రణ మాశించును మక్షిక
రణ మాసించును ధరిత్రిరమణుఁడు కలి దు
ర్గుణ మాసించును నీచుఁడు
గుణిసంగతిఁ గోరు సాధుకులుఁ డేప్రొద్దున్.

78


ఆ.

సిగ్గు పడిన లంజ చెడు సిగ్గు లేనట్టి
కులవధూటి వోలె యిలకుఁ దనిసి
సంతసించు నృపుఁడ సంతుష్టవిప్రుని
పగిది చెడును సత్యభాషణంబు.

79


క.

మృగచండాలము గాడిద
ఖగచండాలంబు కాకి కడుఁ గోపమునన్
దగిలినముని చండాలుఁడు
జగతిన్ దూషకుఁడు సర్వచండాలుఁ డగున్.

80