పుట:సకలనీతికథానిధానము.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200

సకలనీతికథానిధానము


క.

నిత్యంబుగాదు విభవ, మ
నిత్యము దేహంబు నిత్యనిహితంబగుగా
మృత్యువు, గావున నిత్యమ
నిత్యంబును ధర్మవృత్తి నిలుపఁగ వలయున్.

68


క.

నీచునెడ నీచతయును స
దాచారునివలన సాధుతాపూజయు దు
ష్టాచరితువలన నతిదు
ష్టాచరణము చేసిరేని నఘ మే లబ్బున్.

69


క.

అలసునకు విద్య వొందదు
కలుగదు విత్తంబు విద్య కలుగ యేనిన్
కలిమిం బాసిన మిత్రులు
గలుగర మిత్రులకు నేల కలుగున్ ఫలముల్.

70


క.

అనిచిన పరిమళవృక్షము
వనమున నొకడుండి వనము వాసించుగతిన్
తనయుం డుత్తముఁ డన్వయ
మునఁ గలిగిన వంశమెల్ల ముదమును బొందున్.

71


క.

వట్టినమ్రాఁకున ననలము
పుట్టిన వనమెల్లఁ గాల్చు పోలిక ఖలుఁడై
పుట్టినసుతుఁ డన్వయులకు
దిట్టును ఱట్టును ఘటించి తేజము చెఱుచున్.

72


క.

మొదలను సమస్తవిద్యలు
చదువుట వయసునను ధనము సాధించుట సం
పదమీఁద ధర్మి కాదగు
దుది నేమియుఁ జేయ నరుఁడు దొరకమి కతనన్ (?)

73