పుట:సకలనీతికథానిధానము.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

196

సకలనీతికథానిధానము


క.

వైళంబ మేలుకొనుట య
నాలస్యము స్వల్పభుక్తి యధిపతిహితమున్
మేలిమగునిద్ర శౌర్యము
కౌలేయగుణంబులార కని మనవలయున్.

44


క.

అలసియును మోపుమోయుట
చలికిని వేఁడిమికి నోర్చి చనుటయు తుష్టిన్
మెలఁగుటయు గార్దభమునకు
గలగుణములు నరులు మూడు గనికొనవలయున్.

45


క.

ముందటఁ బ్రియమును పిదపన్
నిందయుఁ బచరించు దుర్వినీతాత్ముని బా
యందగు గుత్తుక విషమును
బొందగ ముఖ దుగ్ధమున్న భుజగముకరణిన్.

46


క.

కులవిద్య మిగులనుత్తమ
మలవడ వాణిజ్యకృషులు నవి మధ్యమముల్
కొలుచుట యధమం బారయఁ
దలమోసెడి బ్రతుకు మృతివిధంబగు తలపన్.

47


క.

కొఱగాని బాంధవంబును
కొఱగాని మహీస్థలంబు కొరగాని నృపుల్
గొఱగాని పత్నియును దను
నెఱుఁగకమును విడువవలయు నీహితబుద్ధిన్.

48


క.

చదువని విద్య విషం బగు
ముదుకనికిని దరుణి విషము మునుదారిద్ర్యా
స్పదునకును గోష్ఠి విష మగు
తుదినం గని భుక్తి విషము దుష్టాత్ములకున్.

49