పుట:సకలనీతికథానిధానము.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

193


క.

ఖలునందు మంచివిద్యయు
కులహీనుల నంటియున్న కొమ్మయు విషపం
కలితమగు నందు నమృతము
మలగతకాంచనము గొనుట మంచిగుణంబుల్.

25


క.

అరులిరువురు గలిగిననం
దొరుఁజుట్టముఁ జేసి యవలియొరు నణపదగున్
చరణంబు ముల్లు ముంటనె
వెరవున భేదించినట్టి విధము దలిర్పన్.

26


క.

వ్యవహారక్రయవిక్రయ
వివిధార్జనలందు ద్యూతవేళలయందున్
యువతీసంగమములయెడ
వివేకజనుల్ లజ్జ జాఱవిడువగవలయున్.

27


క.

లోకాపవాదభయమును
స్వీకృతదాక్షిణ్యధర్మశీలవ్రీడా
శ్లోకములు లేనినరుతో
నేకాలము జెలిమి సేయ నేలా శుభముల్.

28


క.

నరపతి భృత్యునిభావము
పరికింపగవలయు పనులు పంపెడిచోటన్
పరిశీలింపక పంపిన
విరసంబునుఁ గార్యహతియు వేగమవచ్చున్.

29


క.

మతి గలిగి ధైర్యవిద్యా
న్వితుఁడై తగుమాటలాడునే ర్పెఱిగి పరేం
గితములఁ గనుగొని మెలఁగెడు
నతఁడు మహీపతికి దూత యగు తలపోయన్.

30