పుట:సకలనీతికథానిధానము.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

182

సకలనీతికథానిధానము


క.

నరుఁ డొకటిఁ దలఁప దైవము
మఱియొక్కటి దలఁచు వేశ్యమాతృక యల్లుం
బొరిఁగొన విషచూర్ణము త
త్పరత బ్రయోగించి తానె ప్రాణము విడిచెన్.

300


క.

వారాంగనయునుఁ బురుషుఁడు
నారయ జవ్వనము నంద యార్జింపని బం
గారము ముదిసిన పిమ్మట
చేరదు పలువెతలబడ్డ సిద్ధము గాదే.

301


వ.

అది యెట్లనిన.

302


నందన:

నందనవిటునకు ననిచి ప్రియమునన్
బొందుచు మఱియొకపురుషుని నెచటన్
చెందక ధనమును చినుకక యుండన్
సుందరి విటునియసువ్వులు గొనగన్.

303


వ.

ఒక్కనాఁడు కాంతాసమేతుండై నిద్రించునల్లుని యాననంబున విషచూర్ణయుక్తంబైన కోలు జొనిపి యీవలికడ వదనంబున ధరియించి యూఁదుసమయంబున.

304


తే.

అల్లుఁ డుత్సర్గ విడువం దదాస్యపవన
గతుల నణగించి మగుడి తద్గళము చొరఁగ
వేళ్యమాతకు విష మెక్కి విధివశమున
కుంభినీస్థలి బడి తన్నికొనుచుఁ జచ్చె.

305


వ.

మఱియు నిట్లనియె.

306


క.

ఒరుసొమ్మున కాసించిన
పురుషుఁడు తనుదాన పొలియు పొలతుఁక సొమ్ముల్
హరియింప మద్దెలీ డొక
యురి కంఠము బిగిసి యనువు లుడిగినభంగిన్.

307