పుట:సకలనీతికథానిధానము.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

సకలనీతికథానిధానము


వ.

అదియెట్లనిన.

120


సీ.

 గరుడుండు[1] తాఁబేళ్ళఁ బొరిగొని భక్షింప
        మతిమంతుఁ డనెడు కూర్మంబు ఖగవుఁ
గనుగొని పలికె నోఖగకులవల్లభ
        జలమున నీకంటి జవము కలిగి
పరచెద నీ వభ్రపథమున బరవు మే
        నోడకుండినఁ దినకుండు మమ్ము
నోడినఁ దినుమన్న నొడబడో ఖగపతి
        కూర్మంబు చని తనకులమువారి


ఆ.

కెఱుఁగ జెప్పి వార్ధి నిందఱమును జేరి
సాగి పక్షి యాకసమునఁ బరిచి
పిలచినపుడె మనము తలచూపి గెలుతుము
రమ్మటన్నఁ గచ్ఛపమ్ము లలరి.

121


వ.

అవ్విధం బాచరించి కచ్ఛపంబులు గరుడునిచేతిఘాతలకు బాసి చనియెఁ గావున.

122


క.

పలువు రొకమూఁక గూడిన
బలవంతుని నైన చిక్కు పరుతురు తార్క్ష్యున్
గెలువవె కచ్ఛపములు మును
జలనిధిలోఁ దలలు చూపి సాహసవృత్తిన్.

123


వ.

అనిన నీలమక్షికం బిట్లనియె.

124


క.

మనుజుఁ డుపాయంబున నే
పనియైననుఁ జేయనోపు బలియుండువలెన్
మనుజుం డుపాయహీనుఁడు
ఘనభుజబలుఁ డయ్యుఁ గార్యగతులకుఁ దప్పున్.

125
  1. గరుడఁడు