పుట:సకలనీతికథానిధానము.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

133


సీ.

అసమాస్త్రపురి మనోహారిణి యనులేమ
        సౌందర్యవిభ్రమచారుమూర్తి
కర్ణారుఁడను నొక్కకష్టరూపునకు మో
        హించి తా నింటివా రెఱుఁగకుండ
నాతనివెంట దాక్షారామపురమున
        కరిగి యందొకచోట నిరవుగాఁగ
నున్నచో కర్ణారుఁ డన్నగరంబున
        దాంబూలపుష్పపదార్థచయము


తే.

దెత్తునని పోవ యొంటి నత్తెరవ యుండ
పురములోపలి పల్లవుల్ తరుణి వినఁగ
నిట్టిలావణ్యవతియైన యిందువదన
యకట వీనికిఁ బ్రాప్త మె ట్లయ్యె ననుచు.

12


వ.

తమలో నిట్లనిరి.

13


చ.

ధనికుఁడొ చెప్పఁజూపగ వదాన్యుఁడొ శూరుఁడొ! రూపవంతుఁడో!
మన మలరింపనేర్చు రతిమర్మవిధిజ్ఞుఁడొ! వీనివెంట నీ
వనరుహనేత్ర తా వలచి వచ్చుట యేమని యెన్నవచ్చు నా
చెనఁటి విధాత మర్కటముచేతికి మౌక్తికహార మిచ్చునే.

14


వ.

అనిన మఱియొక్కరుం డిట్టులనియె.

15


ఉ.

అంగన జాతిహీను వికలాంగుఁ గురూపుని నైన నెప్పుడున్
సంగతి వాయకున్న తనజవ్వన మాతని సొమ్ము సేయు న
య్యంగజుఁడైన దూరగతుఁడైనఁ దలంపదు, పుష్పవల్లి దా
చెంగటి బూరుగున్ విడిచి చేరునె దూరపుచూతపోతమున్.

16