పుట:సకలనీతికథానిధానము.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

సకలనీతికథానిధానము


సీ.

ఆదికాలమున నారాయణాచలమను
        నామంబు దాల్చె నేనగవరంబు
త్రేతాయుగంబున శ్వేతాచలంబను
        ప్రఖ్యాతి గాంచె నేపర్వతంబు
ద్వాపరంబున శేషధాత్రీధరంబను
        పొగడిత గాంచె నేభూధరంబు
కలియుగవేళ వేంకటశైలమనుపేరు
        ధరియించె నేవసుధాధరంబు


గీ.

దేశభాషల నేగిరి తిరుమలనగ
గోరికల నిచ్చు జనుల కేకొండఱేడు
గరుడనామంబు దాల్చె నేగిరులరాజు
తగదె ప్రస్తుతి సేయ నయ్యగకులేంద్రు.

26


వ.

అట్టి వేంకటాచలాధీశ్వరుండు.

27


సీ.

శరభశార్దూలకేసరిమృగంబుల వేఁట
        లాడుచో చెంచులగూడి యాడు
వాసంతవిభవోత్సవంబుల సతులతో
        దెప్పల గోనేటఁ దేలియాడు
కలితకన్యామాసకల్యాణదర్శనా
        మర్త్యమర్త్యులతోడ మాటలాడు
సతతసేవాసమాగతదేశికులు చూడ
        తేఱెక్కి పురవీథిఁ దిరిగి యాడు


గీ.

కొలుచువారికి గొలువంగఁ దలఁవు గలిగి
వచ్చువారికి గోరిన వరము లిచ్చి
యాదరంబున ముచ్చటలాడువాఁడు
నగును వేంకటశైలరమాధివరుఁడు.

28