పుట:సకలనీతికథానిధానము.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

సకలనీతికథానిధానము


వ.

తదీయోపదేశక్రమంబున జలంబులు చొచ్చి జపంబు సేయుచు ధ్యాననిద్రావశంబునఁ దా వివాహంబై పుత్రులం గాంచి ముద్దాడుచున్నాఁడని కలగాంచి జలంబులు వెలువడివచ్చి యప్పుడు.

257


క.

అనలంబుఁ జొచ్చి భార్యయుఁ
దనయులు దుఃఖంపఁ గాంచి దహనముకొలనై
తనువు ఘటించిన వెలువడి
మునివరునకు మ్రొక్కి విఫలముగ వినుతింపన్.

258


వ.

అయ్యోగీశ్వరుండు చింతింపుచుండె నిది సఫలంబుగాని కారణం బేమి యనిన విక్రమార్కుం డిట్లనియె.

259


క.

జపములు జేసెడువారును
తపములు తగజేయువాడ తత్తత్క్రియలన్
విపరీతచిత్తులైన
న్నపగతఫలసిద్ధు లగుదు రందురు నార్యుల్.

260


వ.

అనిన నెప్పటియట్ల వటమునకు నరిగిన బేతాళుని బట్టి కట్టికొని తెచ్చునప్పుడు విక్రమార్కునకుఁ గథ వినుమని యిట్లనియె.

261


ఆ.

ఒక్కవైశ్యుతనయ యుత్పలదళనేత్ర
తండ్రి జచ్చుటయునుఁ దల్లివెంటఁ
బురము వెడలిపోవఁ దెరువున నొకచోట
శూలనిహతుఁడైన చోరుఁ డొకడు.

262


క.

సంతానము సుఖహేతువు
సంతానము మోక్షసిద్ధిసాధన మగుటన్
సంతతి వడయగ వలయును
సంతానము లేమి నరకసాధన గాదే!

263