పుట:సకలనీతికథానిధానము.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

105


క.

గరుడుం డుద్ధతబలుఁడై
నురుగుల భక్షింపుచుండ నురగము లెల్లన్
గరుడనికిలు వరుసగ ని
చ్చిరి ఖగవల్లభుఁడు నట్ల సేయుచునుండన్.

237


వ.

అంత నొక్కనాఁడు.

238


ఆ.

శంఖచూడుఁడనెడు సర్పకుమారుండు
తల్లి కొక్కరుండ తనయుఁ డగుట
పక్షినాథునకును భక్షింప నిలువర్స
వచ్చెననుచు ఫణులు వానిఁ జూప.

239


వ.

తదీయజనని దుఃఖావేశంబున నిట్లని తలంచు.

240


క.

ఒక నేత్రము నేత్రంబే
యొకపుత్రుఁడు పుత్రకుండె యూహింపంగా
నకట బహుసుతులఁ గానక
యొకసుతునిం గనుట, లేకయుండుటగాదే!

241


వ.

అని విలాపించుసమయంబున జీమూతవాహనుండు మార్గవశంబున నచ్చటికిం జనుదెంచి దయాళుండై యప్పుడు.

242


ఆ.

శంఖచూడుఁ దిగిచి సౌపర్ణుముందట
నిలిచి భుక్తి గొను మనింద్యచరిత
యనినఁ బక్షివరుఁడు ఘనవాహు దేహంబు
భుక్తి గొనఁగఁ జేరఁ బురుషవరుని.

243


చ.

వలదని శంఖచూడఫణి వారణ సేయఁగ మేఘవాహు ను
జ్వలతరదేహమాంసములు, చంచుపుటంబున నొల్క నెత్తురుల్
జలజల ధారలై తొరఁగ సాంగుబళా యని దేవసంఘముల్
పలుమరు ప్రస్తుతింప ఫణిప్రాణము గాచెను దారశీలియై.

244