పుట:సకలనీతికథానిధానము.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

సకలనీతికథానిధానము


క.

మెచ్చితి బతిఁసోదరులకు
నిచ్చితి బ్రాణములు వీరి యీబొందులపై
దెచ్చి తల లదుకు మనవుడు
నచ్చేడియ వీడుపడగ నతికె శిరంబుల్.

178


క.

పెనిమిటితల, యనుజునకును
పెనిమిటికిని ననుజుతలయు బెరశిన వా రు
బ్బున లేచి నిల్చి రిద్దఱు
వనరుహముఖి వెరఁగుపడియె వరుఁ డెవ్వడొకో?

179


వ.

అని యడిగిన "సర్వస్యగాత్రస్యశిరః ప్రధానం" బను వాక్యంబు గలదు గావున శిరంబున్నవాఁడె యింతికి వరుం డగునని బేతాళుం డెప్పటియట్ల చనినం బట్టి తెచ్చునెడ నిట్లనియె.

180


సీ.

రమణఁ బ్రలిప్తపురం బేలుచుండు సిం
        హుండను భూవరుఁ డొక్కనాఁడు
వేఁటగా జని ఘోరవిపినమధ్యంబున
        క్షుత్పిపాసలఁ జిక్కి సొగయుచున్న
కార్పటికుండను గహనచారుఁడు చేరి
        యామలకద్వయం బందియిచ్చి
తెరువు దప్పిన దెచ్చి తెరువు చూపిన మెచ్చి
        యెద్ది నీవాంఛిత మిత్తు ననిన


తే.

గాలనేమితనూజ పాతాళసిద్ధ
కనకపురముననున్న తక్కన్య దెచ్చి
పెండ్లి సేయుము నాకు నభీష్ట మిదియ
యనిన నగుగాక యనియె ధరాధరుండు.

181