Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/848

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆర్థిక ఖనిజములు


అనార్థిక ఖనిజములు, రాళ్ళు మున్నగువాటిని తీసివేయుటయే. అట్టి ఖనిజములను, రాళ్లను, చేతులతో నేరి వేయుట, ఖనిజములను నీటియందు కడుగుట, మొదలగు విధానములచే వేరు జేయబడుచున్నవి. ధాతు ఖనిజములను శుభ్రపరచిన తరువాత, వాటిని కరగించిగాని లేక ఇతర రాసాయనిక విధానములచే గాని, వాటిలోనుండు ధాతువులను వేరు జేయుదురు. బంగారు మున్నగు కొన్ని ధాతువులు ఆరూపములోనే రాళ్లయందు మిశ్రమై దొరకుచుండును, అట్టి ధాతువులను సేకరించుట సులభ సాధ్యము. ఆ ధాతువులుండు శిలలను మెత్తగా పొడి గొట్టి నీటియందు తగురీతిని కడుగుటటచే ధాతువులు చాలవరకు వీడిపోవును. చివరకు మిగిలిపోయిన కొంచెము భాగమును రాసాయనిక విధానములచే సేకరింతురు.

ఖనిజములలోని ధాతువులను సేకరించుటకు ముందు ఒక్కొక్కప్పుడు వేర్వేరు విధానములచే వాటిని సంకేంద్రీకరింప జేయుదురు. ఇట్టి విధానము లనేకములు గలవు. ఉదాహరణమునకు అయస్కాంతములచే విడదీయుట (Magnetic separation), నురుగుచే విడదీయుట (Froth floatation) పేర్కొన వచ్చును. అయస్కాంతముచే నాకర్షింపబడు ఖనిజములు సునాయాసముగా వేరుచేయ బడవచ్చును. నురుగుచే వేరుచేయబడు విధానము ఇటీవల కనిపెట్టబడినదే. ఇది యెక్కువగా గంధకిద (సలైఎడు) ఖనిజముల కుపకరించును. ఖనిజములను మెత్తగా పొడిచేసి, కొన్ని రాసాయనిక వస్తువులతో బాటు నీటిలో కలిపి చాల సేపు యంత్రసహాయమున చిలికెదరు. అట్లు చేసినప్పుడు గాలిబుడగల వలన ఏర్పడిన నురుగుతోబాటు ఖనిజకణములు వేరయి, యితర అనార్థిక ఖనిజములు నీటి యడుగుభాగమున జేరును. ఇటీవల ఈ విధానము అలోహ ఖనిజములు సంకేంద్రీకరింపబడుటకు గూడ కొలదిగా నుప యోగింపబడు చున్నది. ఉత్తర ప్రదేశములోనున్న ఖిలేరి గనులలో ఇదివరకు పనికి రాదనుకొన్న సున్నపురాయి నీవిధమున బాగుపరచి యిప్పుడు సిమెంటు తయారుచేయుచున్నారు.

ఇనుము మొదలగు లోహ ఖనిజములనుండి ధాతువులను వేరుచేయుటకై వాటిని బొగ్గు, మరికొన్ని ద్రవీకరణ వస్తువులతో (Fluxes) జేర్చి కొలుములలో కరగింతురు. ఈ విధానమునందు బొగ్గు వేడిని జనింప జేయుట యేగాక రాసాయనికముగా గూడ పనిచేయును. అల్యూమినియం మొదలగు ధాతువులను ఖనిజముల నుండి విడదీయుటకై విద్యుచ్ఛక్తి విరివిగా నవసరము. ఈ విధముగా నార్థిక ఖనిజములు లాభ దాయకములుగా నుండగలుగుట వాటియందున్న ధాతువులను విడదీయు పద్ధతుల పై గూడ నాధారపడియుండును.

ఆర్థిక ఖనిజములు, వానినుండి యుత్పత్తియగు పదార్థముల ఉపయోగములు  :- ఆర్థిక ఖనిజముల యొక్కయు, వానినుండి తీయు ధాతువుల, ఇతర వస్తువుల యొక్కయు ఉపయోగము అసంఖ్యాకములుగా గలవు. మనము ప్రతిదినము వాడుకొను పెక్కు వస్తువులందు ఖనిజము లేదో యొక రూపము వహించియుండును. ఉదాహరణకు కాగితములందు సుద్ద మన్ను (China clay) పూత యుండును. పెన్సిళ్ళ ములుకులు మెరుగుమట్టితో తయారు చేయుదురు. ప్రతి చిన్న మేకుగూడ ఇనుము ఖనిజములనుండి తయారుగాబడిన యినుముతో చేసినదే.

కొన్ని ఖనిజములు చాల అరుదుగను, స్వల్పపరిమాణములలోను దొరకినను, వాటి ప్రాముఖ్యము చాల ఎక్కువగా నున్నది. తేజాతువు (రేడియం) కిరణాతువు (యురేనియం), మొదలగు ధాతువులు ఖనిజము లిందుకు తార్కాణము. ఇవిగాక పెక్కు ధాతువులు, వివిధములైన ధాతుమిశ్రణములను (alloys) తయారుచేయుట యందుపకరించుచున్నవి. కొన్ని మిశ్రణముల యందు ఒక్కొక్క లోహము మిగుల కొలదిగా నున్నప్పటికిని దాని కలయిక వలన మార్పు చాలా యెక్కువగానుండును. నూటికి ఒకపాలుకంటే తక్కువగా రోచాతువు (వెనాడియం) అను ధాతువు చేర్చుటవలన ఉక్కు కెంతయో బలము చేకూరును. అట్లే చండాతువు (టంగ్ స్టన్) అను ధాతువు గట్టితనము ఎక్కువగల యనేక మిశ్రణము లలో నుపయోగింతురు. భూగర్భశాస్త్రజ్ఞులకు మాత్రమే తెలిసి పరిశ్రమలలో నెందుకు పనికిరావనుకొని, తదుపరి యెంతో నుపయుక్తములైన కొన్ని ఖనిజము లిటీవల ననేకము గన్పించుచున్నవి. కృమిరూపిజము (వర్మిక్యు లైటు (Vermiculite). సిల్లిమనైటు (Sllimanite)