Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/729

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆకృతి రచన - ఆధునిక నిర్మాణ ద్రవ్యములు


వాతావరణము మొదలగు వాని ప్రభావమును, ప్రత్యక్షముగా గాని, పరోక్షముగా గాని కలిగియుండును. అయినప్పటికిని భవననిర్మాణమునకు సునాయాసముగా లభించు నిర్మాణద్రవ్యములే అతిముఖ్యమైన అంశములు. ఏలయన భవన నిర్మాణ పరికరములైన ఇటుకలు, రాళ్లు, కలప, కాంక్రీటు మొదలైనవాని ద్వారానే శిల్పి తన యొక్క కలలకు వాస్తవిక ఆకృతిని ఈయగలుగుచున్నాడు.

ప్రస్తుత విషయమును గురించిన చర్చకు దిగుటకు ముందు, వాస్తుశాస్త్రమునందలి వివిధరీతుల యొక్క పరిణతితో, నిర్మాణ ద్రవ్యము లెట్టి పాత్రను నిర్వహించినవో అవగాహము చేసికొనుట కొరకు, పూర్వ పరిస్థితులను అన్వేషించుట మిక్కిలి ప్రయోజనకారి కాగలదు. కలపయే మానవునికి తెలిసిన అత్యంత పురాతనమైన నిర్మాణద్రవ్యముగా కనబడు చున్నది. బౌద్ధుల శిలా వాస్తువు అస్తిత్వములోనికి వచ్చుటకు చాల కాలము క్రిందటనే మన దేశములో దారుమయ నిర్మాణములు ఉచ్ఛస్థితినందు కొన్నవి. బౌద్ధయుగమునకు చెందిన (చైత్యములు, కమానులు, సూర్యవాతాయనములు, వర్తులా కార మైన పైకప్పులు మొదలైన) కళాకృతులు, నిర్మాణము లన్నియు ఆకాలపు పని వారికి సుపరిచితములును, సర్వసాధారణములును ఐన కలప కట్టడములందలి వివిధ రీతులకు రాతిలో నేర్పరచి నటువంటి ప్రతిరూపములే. జనులకు మొట్టమొదట తెలిసిన నిర్మాణ పద్ధతిని 'దూలముల కట్టడము' (Trabeated mode) అందురు. దీనిలో నిలువు స్తంభములు, గొడుగురాయి (Lintel) ప్రధానాంగములు.

ఈ నిర్మాణ విధానము అటుతరువాతివారిచే కూడ అనుసరింపబడినది. కాని, వారు దీర్ఘ కాలము మనునట్టి రాతినే నిర్మాణ ద్రవ్యముగా నుపయోగించిరి. ఈజిప్టు దేశపు శిల్పులు బ్రహ్మాండములైన వారి దేవాలయములను నిర్మించుటకు రాతి స్తంభములను, రాతి దూలములను, రాతి పలకలను ఉపయోగించిరి. సమున్నతమైన రాతి స్తంభములు, గొడుగు రాళ్ళు ఏ పరిమాణముగలవి లభ్యమగునో వానిని బట్టి కట్టడములుండెడివి. కనుకనే బ్రహ్మాండమైన వారి భవనములు అనేక స్తంభములతో గూడియుండి, స్తంభాల వ్యూహమో అన్నట్లు తోచును. వారు వజ్ర కాఠిన్యము గల గ్రానైటు రాతినే తమ భవనముల కుపయోగించిరి. భవనముల యొక్క ఆధారస్తంభములను మిక్కిలి దగ్గర దగ్గరగా నిలుపవలసివచ్చెను. ఇంతే కాక, నల్లరాయి మిక్కిలి కఠినమైనదగుట వలన స్తంభముల మీద గాని, దూలముల మీద గాని ఎటువంటి చెక్కడములను చెక్కుటకు అవకాశము లేక పోయెను, అందుచేత ఈ కట్టడములు చూపులకు శిలాస్తూపములవలె కనుపించును.

గ్రీకుల యొక్క భవనములు కూడ ఇదే సిద్ధాంతము ప్రకారము కట్టబడినవి. కాని అవి ఈజిప్టు దేశపు కట్టడముల కంటె బాహ్య స్వరూపములో భిన్నములుగా నుండెడివి. నిర్మాణములకు గ్రీకులు ఉపయోగించిన శ్రేష్ఠమైననిర్మాణ ద్రవ్యమే ఈ భిన్నత్వమునకు కారణమైయున్నది. వారు ఉపయోగించిన తెల్లచలువరాయి చెక్కడమునకు మిక్కిలి అనుకూలమైన దగుటచే గ్రీకులు దానితో సున్నితమును అతి రమ్యమును ఐన శిల్పకళను అభివృద్ధిపరచగలిగిరి. చలువరాయియే లేకపోయినచో గ్రీకు శిల్పము మరొక విధముగా నుండియుండెడిది.

ఏ ప్రదేశములలో రాయి లభ్యమయ్యెడిది కాదో, అచ్చట పూర్తిగా భిన్నమైనటువంటి నిర్మాణ విధానము వలంబింప బడెడిది. సాధారణముగా నదులు విశేషముగా నుండు ఒండ్రుమట్టి భూములలో రాయి అరుదుగా దొరకును. అస్సీరియా, బాబిలోనియావంటి పశ్చిమాసియా దేశములలోను, యూఫ్రటీస్, టైగ్రిస్ నదితీరముల యందును నివసించు పూర్వజను లకు రాయి బొత్తిగా దొరకక పోవుటచే, వారు తమ భవన నిర్మాణమునకు ఇటుకలు నుపయోగించిరి. భవనముల పైకప్పునకును, గోడలకును ఇటుకలు మాత్రమే ఉపయోగింప వలసివచ్చెను. ఇంటి పైకప్పులు నిలువంపుగా కట్టినసరంబీలుగాను, గోపురాకారముగాను ఉండెడివి. ద్వారబంధములపై నుండు అడ్డరాయిస్థానములో కమానులు (arches) ఉపయోగించ బడుచుండెను. ఈ విధానము కమాను నిర్మాణ విధానము అర్క్యుయేటెడ్ (Arcuated) అని పిలువబడుచున్నది, రాయి దొరకకపోవుటచే మధ్యయుగమునందలి వంగ దేశపు వాస్తువు మిగిలిన భారతదేశ వాస్తువు కంటే పూర్తిగా భిన్నముగా నున్నది. మొగలాయీల కాలములొ తొలుదొల్త నుండిన వాస్తువునకును, వారి ఉత్తరోత్త