పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షహీద్‌ - యే - ఆజమ్‌ అష్పాఖుల్లా ఖాన్‌

కూడా అధికంగా వుంటుంది. పరిస్థితులు అనుకూలంగా వుండకపోవడం వల్ల యిటువంటి విప్లవకర ఉద్యమాలలో పడే శ్రమంతా తరచూ వృధాగా పోతూంటుంది.

మీరెవరి కోసం పాటుపడుతున్నారో వాళ్ళే మిమ్మల్ని నానా మాటలాంరు. చివరికి మనస్సు లోపలే కుమిలి ప్రాణత్యాగం చేయాల్సి వస్తుంది..ఏది చేసినా అంతా కలసి చేయండి. చేసేదంతా దేశ క్షేమం కోసమే చేయండి. దీని వల్ల అందరికి మేలు కలుగుతుందనే నేను దేశ ప్రజలకు విన్నవించుకుని వారికి చివరగా సవినయంగా కోరు కునేది., అని శ్రీ బిస్మిల్‌ తన అభిప్రాయాన్ని చాలా విస్పష్టంగా ప్రకటించారు. (బిస్మిల్‌ ఆత్మకధ: 139)

ప్రభుత్వ ఖజానాను దోచుకోవాలని విప్లవ సహచరులు, నిర్ణయించినప్పుడు అష్పాఖుల్లా ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఈ యాక్షన్‌ వలన విప్లవోద్యమానికి తీరని నష్టం జరగగలదని హెచ్చరించారు. తొలుత మనం ప్రజలను పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేసి విప్లవోద్యమాన్ని బలోపేతం చేద్దామని ఆయన సూచించారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా, పదిమంది సాయుధులై పోరాటాలు చేసినంత మాత్రాన ఫలితం ఉండదని ఆయన చేసిన హెచ్చరికను ఎవ్వరూ ఖాతరుచేయలేదు. చివరకు ఈ చర్య ఫలితంగానే ప్రభుత్వం విరుచుకుపడి విప్లవకారులను తుదముట్టించి. విప్లవోద్యామానికి తీరని నష్టం కలిగించింది.

షహీద్‌-యే-ఆజం అష్పాఖ్‌

అష్పాఖ్‌ ఎదురు చూస్తున్న 1927 డిసెంబరు 19వ తేదీ వచ్చేసింది. ఆయన ఆశించిన పెళ్ళి రోజు రానే వచ్చింది. ఆ రోజు కూడా ఎప్పటిలాగే ప్రాత:కాలాన ఆయన నిద్రలేచారు. స్నానపానాదాులు ముగించారు. శుభ్రమైన బట్టలు ధరించారు. ఫజర్‌ నమాజ్‌ అదా చేశారు. ప్రశాంతంగా ఖురాన్‌ గ్రంథ పరనంలో మునిగిపోయారు. మృత్యువును ఆహ్వానిస్తూ మాతృభూమి విముక్తి పోరాట యజ్ఞంలో తానొక సమిధ కానున్నందున ఎంతో ఆనందిస్తూ, జైలు అధికారుల రాక కోసం ఎదురుచూడసాగారు.

ఉరిశిక్ష ఏర్పాట్లు పూర్తి చేసిన జైలు అధికారులు అష్పాఖ్‌ సెల్‌ వద్దకు వచ్చారు. ఆ అధికారులను చిరునవ్వుతో పలకరిస్తూ ఏర్పాట్లు పూర్తయ్యాయా? అన్నారు. ఆ ప్రశ్నకు అధికారులు చలించిపోయారు. మా తప్పులుంటే మన్నించండి ఆని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రబుత్వాధికారులుగా, ఉద్యోగులుగా మీరు చేయాల్సింది మీరు చేశారు.

67