పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షహీద్‌ - యే - ఆజమ్‌ అష్పాఖుల్లా ఖాన్‌

ఈ సాహసోపేత సంఘటన ప్రభుత్వానికి సవాల్‌గా మారగా, భారతీయులలో సంతోషానికి కారణమైంది. రాజకీయంగా స్తబ్ధత కమ్ముకున్న జాతీయోద్యమంలో కాకోరి రైలు దోపిడి సంఘ టన గొప్ప కదలిక తెచ్చింది. ప్రజలలో నూతన ఉత్తేజానికి కారణమైంది. విప్లవకారులను ఉత్తేజితులను చేసింది. పట్టుమని పదిమంది కూడా లేని విప్లవకారులు పెద్ద సంఖ్యలో ఉన్న ప్రబుత్వ బలగాలను ఏం చేయగలరని అపహాస్యం చేస్తున్న రాజకీయ

పక్షాల నాయకులకు కాకోరి వీరులు తగిన సమాధానం ఇచ్చారు. కర్తవ్యదీక్ష, సాహసం, ఉద్యమ నిబద్ధత ఉంటే ఎంతటి బలంగల శక్తినైనా పరాజయం పాల్జేయవచ్చని ఈ సాహసోపేత సంఘటనతో విప్లవకారులు నిరూపించారు.

ఈ సంఘటనతో విప్లవకారులలో ఆత్మవిశ్వాసం బలపడి, మరిన్ని చర్యలకు పాల్పడకముందే, ఆ దిశగా పరిస్థుతులు విషమించకముందే కాకోరి యాక్షన్ లో పాల్గొన్న సబ్యులందరిని అరెస్టు చేసి, అంతం చేయాలని ప్రబుత్వం నిర్ణయించింది. ఈ సంఘటన అంతు తేల్చేందుకు విచారణాధికారి సర్‌ హార్టన్‌ను ప్రభుత్వమ్ నియమించింది. అందుకు ప్రత్యేక పోలీసు దళాలను, బ్రిటిష్‌ ఉన్నత అధికారుల బృందాలను ఏర్పాటు చేసింది. అరెస్టులు అత్యంత వేగంగా జరగాలని ఆదేశించింది. విప్లవకారుల అరెస్టులకు నజరానాలు ప్రకటించింది. విప్లవకారుల కోసం అన్ని వైపుల నుంచి పోలీసుల వేట భారీ స్థాయిలో ప్రారంభమైంది. బ్రిటిష్‌ రహస్య పోలీసుల వ్యవస్థ అప్రమత్తమైంది. విప్లవకారుల కోసం పోలీసులు అంగుళం అంగుళం గాలించడం ఆరంభమైంది.

43