పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షహీద్‌ - యే - ఆజమ్‌ అష్పాఖుల్లా ఖాన్‌

ఆయన సహచరుడిగా మాత్రమే మెలిగారు తప్ప బిస్మిల్‌ అనుచరుడు అనిపించుకోడాన్ని ఇష్టపడలేదు. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ, ఆత్మాభిమానానికి ఎటువంటి విఘాతం కలుగనివ్వకుండా, నికార్సయిన విప్లవకారునిగా అష్పాఖ్‌ విప్లవోద్యమంలో ఎదిగారు.

విప్లవకారుల సమావేశాలలో ఇతర మిత్రుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా, తన అభిప్రాయాన్ని, స్పష్టంగా సూటిగా ప్రకటించడం ఆయన అలవాటు. సహచర విప్లవకారులు ఎంతగా వ్యతిరేకించినా ఆయన మాత్రం తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా వెల్లడించేవారు. ఒకసారి సమావేశం నిర్ణయాలు తీసుకున్నాక, ఆ ఉమ్మడి నిర్ణయాలను గౌరవించడం, ఆ నిర్ణయాన్ని ఆచరించడంలో ఎంత ప్రమాదం ఉన్నా ఏ మాత్రం ఖాతరు చేయక ముందుకు సాగటం అష్పాఖ్‌ లోని ధైర్యసాహసాలకు, ఉత్తమ ప్రజాస్వామిక లక్షణాలకు ప్రతీక.

అష్పాఖుల్లా ఖాన్‌ స్వభావాన్ని, ప్రవర్తనను, ఆత్మాభిమానాన్ని బిస్మిల్‌ తన ఆత్మకదలో ఉటంకిస్తూ, నీవు నాకు తమ్ముడి తీరుగా అయినావు. కాని తమ్మునిలా చూసుకున్నా నీకు తృప్తి కలుగలేదు. సరిసమానుడిగా చూడాలని, సమాన స్థాయిలో నా మిత్రుడునిగా లెక్కించబడాలని నీవు కోరుకునేవాడివి. చివరకు అదే అయ్యింది. నీవు నాకు నిజమైన స్నేహితుడివైనావు. ఒక్క పచ్చి ఆర్యసమాజికుడికి ఒక ముహమ్మదీయునికి మధ్య స్నేహం ఎలా కలిసింది. అని అంతా ముక్కుపై వేలేసుకునేవాళ్ళు, (బిస్మిల్‌ ఆత్మకథ: పేజి. 105) అని స్వయంగా రాసుకున్నారు.

ఈ విప్లవ వీరుల మధ్య అంతగాఢమైన సంబంధాలు ఉండడం వలన కాకోరి రైలు సంఘటన కేసులో ఉరిశిక్షపడ్డాక, జైలు నుంచి 1927 చివరి మాసాల్లో బిస్మిల్‌ రాసిన ఆత్మకథలో అష్పాఖుల్లా ఖాన్‌ మీద ప్రత్యేకంగా ఒక అధ్యాయం కేటాయించారు. ఆ ఆధ్యాయాన్ని, నేనీ కేసులో భాగస్వామినై వహించిన పాత్ర నిర్వహణాక్రమంలో ఎవరెవరి జీవితాల భాధ్యత నాభు జస్కంధాలపై వుండిందో- వాటిలో అధిక భాగం శ్రీ అష్పాఖుల్లా ఖాన్‌వారసేకి సంబంధించి వుంది. కనుక ఈ అంతిమవేళ ఆయన గురించి కూడా ఈ చేత్తో నాలుగు మాటలు రాయడం నా కర్తవ్యమని భావిస్తున్నాను, (పేజి.105) అని ప్రారంభించారు.

ఈ విధంగా బిస్మిల్‌ వ్యక్తం చేసిన విషయాల ద్వారా విప్లవోద్యమంలో అష్పాఖుల్లా ఖాన్‌ నిర్వహించిన పాత్ర ఎంతటి ప్రాధాన్యత గలదో అవగతం కాగలదు.

27