పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

106) అని స్వయంగా బిస్మిల్‌ చెప్పుకున్నారు. ఆ మిత్రుల సన్నిహితులు, కుటుంబీకులు ఎటువంటివిమర్శలు చేసనా, ఈ మిత్రులిరువురి మధ్య చివరి వరకు చక్క ని స్నేహబంధం వర్థిల్లింది. ఈ విషయాన్ని బిస్మిల్‌ పేర్కొంటూ, నేను నీవు అనే తేడా లేకుండాపోయింది మన మధ్య, తరచూ నీవూ నేను ఒకే కంచంలో తిన్నాము, ఆని ఆత్మకథలో (పేజి. 106) రాసుకున్నారు.

బిస్మిల్‌ హృదయంలో ముస్లింల పట్ల ఏర్పడిన అపోహలను అష్పాఖ్‌ తన చక్కని ప్రవర్తనతో తుడిచేయగలిగారు. మాతృభూమి విముక్తికి సంబంధించిన అంశం ప్రధాన మైనప్పుడు హిందువైనా, ముస్లింవైనా ఒకే రకంగా స్పందిస్తారని, ఒకే రకంగా త్యాగాలకు సిద్ధపడతారని, ఈ సంసిద్ధతకు త్యాగాలకు మతం ఏమాత్రం అడ్డంకి కాదని కానేరదని అష్పాఖ్‌ తన అచంచలమెన దీక్షతో, నిబద్ధతతో సాక్ష్యం పలికారు. చివరకు హిందువులు ముస్లింలలో ఏదో తేడా ఉందనే ఆలోచనే నా హృదయం నుండి నిష్క్రమించ సాగింది. నీవు నా మీద ప్రగాఢ విశ్వాసం, అమిత ప్రీతి కలిగి ఉండేవాడివి, (ఆత్మ కథ: పేజి 106) అని సనాతన సంప్రదాయానురక్తుడు, ఆర్యసమాజికుడు పండిత రాంప్రసాద్‌ బిస్మిల్‌ స్వయంగా అష్పాఖుల్లా ఖాన్‌ గురించి చెప్పుకోవాల్సి వచ్చింది.

మాతృభూమి సేవకు జీవితం అంకితం

మాతృదేశ సేవలో తన జీవితం గడపాలని స్థిర నిర్ణయానికి వచ్చిన అష్పాఖుల్లా తన కుటుంబంలోని అన్నదమ్ముల్లా, ఉన్నత విద్యాభ్యాసం చేయడానికి అన్ని రకాల అవకాశాలున్నా చదువును మాత్రం కొనసాగించలేదు. చిన్ననాటనే దేశాభిమానం పుణికిపుచ్చుకున్నఆయన ఏడవ తరగతిలోనే, విప్లవ భావాల పట్ల ఆకర్షితులయ్యారు. ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే ఆయన చదువు సాగింది. ఆ తరువాత సహాయనిరాకరణ ఉద్యమం దిశగా ఆకర్షించబడ్డారు. ఆ ఉద్యమంలో పాఠశాల విద్యార్థిగానే ప్రవేశించారు.

ఆనాడు అష్పాఖ్‌ కుటుంబానికి ఉన్న పేరు ప్రతిష్టల కారణంగా ఉన్నతాధికారులైన కుటుంబ సభ్యుల సహాయంతో మంచి ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి అష్పాఖ్‌ ఇష్టపడలేదు. మాతృభూమి సేవలో గడపాలన్న తన జీవితాశయానికి ప్రబుత్వ ఉద్యో గాలు అడ్డుగా నిలుస్తాయని ఆయన భావించారు.


22