పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/92

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజయవిలాసము 48

గీ. పరులఁ బొరిఁగొను జోదుకు పరులు నరుల
దోసములు దోసునయ్యకు దోశ లలరు
నప్పనికి నప్పము లతిరసాధిపతికి
నతిరసంబుల నిచ్చువారైరి వరుస. 56

సీ. బడలినవారికి వడపప్పుపానకా
లనఁటిపం డ్లోపిన యన్నిగలవు
యెళనీరు బిసనీరు లెందుహేరాళంబు
నీరుచల్లయుఁ బెరు గపార మచటఁ
గప్పురగంధంబు కైరవల్పట్టీలు
తట్టుపునుంగును జుట్టుపూవు
లెందువేడినవెల్ల యేచప్పరంబున
విప్పైన గొడుగులు విసనకఱ్ఱ
గీ. లేలకులు శొంఠియును లవంగాలు పనస
తొలలు చెఱుకులు ఖర్జూరఫలము లెన్ని
వేడినను గొండనుచు జాటు వేంకటేశు
భక్తజాలంబు తిరునాళ్ళ ప్రజకు నపుడు. 57

సాయంకాలవర్ణనము


మ. అపరాహ్ణంబను వర్ణకారుఁడు ప్రతీచ్యంభోజపత్రాక్షి క
చ్చుపడన్ జందురుకావి యంబుదపటస్తోమంబు నన్నించఁగా
నపరాబ్ధిస్థలినుంచు కుంకుమరస వ్యాకీర్ణకుంభంబునాఁ
దపనుం డస్తవసుంధరాధరము చెంత న్నిల్చి గ్రుంకెన్వడిన్. 58

సీ. గఱులు చుఱుక్కవ నెఱసంజకాకసోఁ
కిన వెఱఁగంది యీకియలు ముడుచు
ముడిచి కౌఁగిలి పెంటి సడలించి నిట్టూర్పు
నిగుడ మోమీక్షించి దిగులుఁ జెందుఁ
జెందిఁ వాపోవుచుఁ జెంతఁ ద్రిమ్మరుపెంటి
దఱిమి మెట్టగఁ జేరి వెఱచి మరలు
మరలి బిల్చుచు తొల్లి మమతఁ గూడిన తన
నెలవులు మూర్కొని కలఁకి యొరలు