పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

vi

పటములు అత్యంతావశ్యకములేగాని ఆ పని వట్టి ధనమాత్రసాధ్యముకాదు. పాండిత్యమును కాలమును పరిశ్రమయు ఆవశ్యకములు. కాఁబట్టి ప్రస్తుతము అకాడమీవారు తమ సార్వజనీన ప్రచురణములలో (Popular edition series) నొకటిగా ఈ గ్రంథము యొక్క ప్రతులు లభ్యము లగునట్లు దీనిని వెలువరించుట ముదావహము. ఇందువలన ఒక కొలత తీరి సవ్యాఖ్వాముద్రణ భాగ్యము గ్రంథమునకు మున్ముందు కలుగునుగాక.

1. కవియొక్కకాలము

ఈకవియొక్క కాలము ఇప్పుడు చక్కగా క్రీ. శ. 1620 నుండి 1880 నడుమనని తెలియున్నది. ఇదివరలో చరిత్రకారులు పరి పరి విధముల నిర్ణయించినారు. (వివరములకు చూ. నేలటూరి వెంకటరమణయ్యగారి దాక్షిణాత్యాంధ్ర సాహిత్యము ద్వితీయ ముద్రణము పుట 54-61). (1) దీనిని మొదట ప్రకటించిన శ్రీపూండ్ల రామకృష్ణయ్యగారు ఇతనిని శ్రీకృష్ణరాయలకును అప్పకవి ఇతనిని ఉదాహరింపనందున అప్పకవికిని (1650) యీవలివాడని తలఁచిరి. (2) కందుకూరి వీరేశలింగముపంతులుగారు పదునేడవ శతాబ్దమునకు లోపలివాఁడు కాఁడనియు మఱికొన్ని యుదాహరణములచేత 17వ శతాబ్దమునకును పదునెనిమిదవ శతాబ్దమునకును కొనిపోయిరి. (౩) కొత్తపల్లి సూర్యారావుగారు 18వ శతాబ్ద మనియ కూచిమంచి తిమ్మకవికి సమకాలికుఁడనియు 'కర్ణాటకుండీర చోళపాండ్యమండల ప్రముఖాభి...' ఇత్యాదికములచే నిర్లయించినారు. వీనినెల్ల విమర్శించి శ్రీనేలటూరి వెంకటరమణయ్యగారు చారిత్రకాధారములచేత ఈకవి కర్ణాటకుండీరమండలేశ్వరులచేత సత్కారము పొంది నది క్రీ. శ. 1648-9 లకు ముందై యుండవలెననియు అందులకు సాక్ష్యము ఇతని చండ విద్యావతీదండకరాజమనియు తేల్చినారు. ఈ దండకము క్రీ. శ. 1673లో తంజాపురిని పాలించుచుండిన ముద్దళగిరిమీఁద చెప్పబడినది. తుండీర ప్రభువులలో వరదప్పనాయకుఁడు విద్యా ప్రియుఁడు విద్యాపోషకుఁడు. కర్ణాటక రాజులలో పెద వేంకటపతిరాయలు 1630-1642 కవిజనాశ్రయుఁడు. “కావున గణపవరపు వేంకటకవిని సమ్మానించిన కర్ణాటక తుండీరప్రభువులు పెదవేంకటపతి దేవమహారాయలును చెంజివరదప్పనాయకుఁడునై యుందురు. అగునేని యతఁడు క్రీ. శ. 1620 మొదలు 1680వఱకును వర్దిల్లెనని చెప్పవచ్చును."