Jump to content

పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తొలిపలుకు

ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రివర్యులు శ్రీ యం. ఆర్. అప్పారావుగారు చేసిన సూచన ననుసరించి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ తెలుగు భాషలోని ప్రాచీనసాహిత్యము అందరికి అందుబాటులో నుండునట్లుగా ముద్రించి ప్రకటింప వలెనని నిశ్చయించినది. తెలుగుభాషలోని పూర్వగ్రంథసముదాయము యీనాడు పాఠకునకు సక్రమముగా సరసమైన ధరకు లభ్యమగుటలేదు. ఈ లోటును తీర్చి ప్రాచీన గ్రంథసంచయమును విడివిడిగా ప్రకటించుటకు సాహిత్య అకాడమీ ఒక ప్రణాళిక సిద్ధము చేసినది ఈ ప్రణాళిక ప్రకారము యీ కార్యక్రమము మూడు తరగతులుగా విభజించనైనది. మొదటిది ప్రాచీన ప్రబంధాల ప్రకటన; రెండవది మహాభారతము ప్రచురణ; మూడవది హరివంశము, భాస్కరరామాయణము, బసవపురాణము, భోజరాజీయములను సంగ్రహించి ప్రకటించుట. పై ప్రణాళిక ప్రకారము ప్రచురించుబడు ప్రతి గ్రంథములో గ్రంథకర్తను గూర్చి, గ్రంథ ప్రాశస్త్యమును గూర్చి వివరించు సుమారు 40 పేజీల పీఠికను చేర్చవలెనని నిశ్చయించనైనది.

ఈవరుసలో ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసమును పరిష్కరించి పీఠిక వెలయించి మాకంద జేసిన ప్రసిద్ధ విద్వాంసులు, పరిశోధక పండితులైన వేదం వేంకటరాయశాస్త్రిగారికి అకాడమీ పక్షాన అనేక ధన్యవాదాలు.

పైన పేర్కొనిన గ్రంథసంపుటాల వ్రాతప్రతులను సిద్ధము చేసి ముద్రించుటకు అవసరమైన డబ్బును పూర్తిగా అకాడమీకి యిచ్చుటకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, వాగ్దానము గావించి అందులో చాలామట్టుకు డబ్బును విడుదల కూడ చేసినవి. అందుకు అకాడమీ పక్షాన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు ధన్యవాదాలు.


దేవులపల్లి రామానుజరావు

కార్యదర్శి

హైదరాబాదు

1. 1. 1977