పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/298

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వారి క్రొవ్వని నణఁగింతు మీరున్నఁ జాలు’ ననిన నామేటితో వార ‘లోరప్ప రవ్వ నీయుప్పు దిన్నవారము గావున తారు నీ తోటివారము యెందుకా కరుమపుసాకిరి లేకున్న నినువంటి జన్నిగట్టులు సాకిరియని సెప్పనేల నీనేల నీనేల చెఱువుతెగి వెల్లువఁ బోయెడి నీళ్ళరిగట్టఁ గూడునా పోయిన ప్రాణంబులు మగుడునా యిత్తడి పుత్తడివలె యొఱకు వచ్చునా సామిదోగులై పాఱిపోయెడి వారు తిరుగ రానేర్తురా హరిదళంబు హరిదళంబు చాయ చూతంతేయీతంతే’ యని పురికొని పలుకు పలుకుల కతండు నిచ్చమెచ్చి యీపరి యందఱ మొక్కచిదుమై వెంటనే గుంపులుడ్డలు తుటుములు మూకలుగా డాకలు మీఱ నాలుగు కోపులతో నీనిన పులుల బాళిని యూతలు గ్రమ్మిన లీలను పొంగుబారిన చాయను వలలు వేసిన పొందిగను సుడిగాలి వీఁచుదెప్పరంబున కొంగలకు దూఱుబైరి డేగలగతిని కణితిరీఁగలు ముసురుకొను భాతిన చుల్లరంబుల మొత్తంబున సివంగులు చుట్టుకొను హరువున సరవత్తుల వేగమున రంజకంబు దినుసున సురటి దిప్పినట్లు తోఁకచిచ్చునాఁగ నెదిర్చిన పగర గుండెలు చిద్రుపలుగ విదిర్చవలె నిలనద్రువ ననుచుఁ దమతమ ముస్తీదులతో సిస్తుగా దోస్తిని చుట్టుముట్టి కోపాటోపంబున— 788

ప్రాసభేదము — అపూర్వప్రయోగము
క. మీసలు మెలిబెట్టుచుఁ గడు
రోసమ్ములు గ్రమ్ముకొనఁ బురోభాగములం
దాశ లద్రువ కేక లిడుచును
దూసినకత్తులను త్రిప్పుడులు గుడుసువడన్. 789

ఉ. వ్రేసినలేదు బంతి యని వ్రేటునవెంబడి జొచ్చి బిత్తఱిన్
డాసి బెళాన లాగెను తటాలున వ్రేసి గుణంబు రాటమున్
సీసము కత్తి చొంగణ నృసింహము కొక్కన కెల్లి బెట్టు య
భ్యాసి విధంబు జూపుచుఁ గిలార్పుచు మే ల్జెగజెట్లకైవడిన్. 790

ఆ. వింగళించి యాటవెలఁది చందంబున
కోపులందు మీఱి యేపుతోన
మిత్రగణము లతి విచిత్రంబైకొన
దైవగణము లెదురఁ దారసించె. 791