పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్లేషానుప్రాణితరూపకాలంకారవ్యక్తోపమాధ్వని
సీ. పల్లపాణిధమ్మిల్ల మభ్రచ్ఛాయ
మగువ సిబ్బెంపుచన్నుఁగవ సున్న
కంజాతనేత్రి వక్త్రము మహాదర్శము
మానవతీమణి కౌను బయలు
చిన్నారికన్నియ జిగినెన్నొసలు కల
చిలుకలకొల్కి పొక్కిలి భ్రమమ్ము
జవ్వని రూపంబు చంచలాప్రాయంబు
వారణయాన నూగారు జల్లి
గీ. యైన నొకయించి చూచిన యంతలోన
నెల్లవారల మిగుల మోహింపఁజేయు
మహిమగల నీకు నఖిలభూమండలమున
మోహినీనామ మన్వర్థమునఁ జెలంగె. 741

ఉ. గ్రక్కున గౌఁగిలించి దెలిగన్నుల చల్లనిచూపు జూచి నీ
చక్కెరమోవి తేనియ లొసంగి మనోజునికేళిఁ దేల్చి నా
యక్కఱ బాపుమన్న వదనాబ్జమున న్జిఱునవ్వుఁ దెచ్చి యా
జక్కవ చంటి యిట్లనియె జక్కెర లొల్కెడు ముద్దుబల్కులన్. 742

సీ. చదువును గుడికొల్వుసాధనయును కడ
నోసరించిన యట్టి యునికిఁ దలఁచి
వీణాదిసంగీతవిద్య లొజ్జకు మళ్ళ
నొప్పగించిన యట్టి యునికిఁ దలఁచి
దాసదాసీపశుతతి బరామరిసింప
కూరక యున్నట్టి యునికిఁ దలఁచి
యిల్లాలితోఁ బొందు నెడజేసి యిచట ని
న్నొంటి యుంచిన యట్టి యునికిఁ దలఁచి
గీ. యేమి పలుక నీకు నెట్లుండునో యనె
డునికిఁ దలఁచియ గడు మనికిఁ దలఁచి
యున్నదానగాని నిన్నెఱుంగయుండఁ
గలదె చింత కొండుకారణంబు. 743