పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/266

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. తందనాలు బాడి యంద మాయె నటన్న
వానిపై మీఁది దువ్వలువ వైచి
యెడకారితనములు నడచు గత్తెరకాండ్ర
కిచ్చకమ్ములు గాఁగ మెచ్చు లొసఁగి
పిలుపుఁ జెప్పినరాక నిలిచినబోఁటికి
రోవట్టుగా వేడు రొక్క మిచ్చి
చడిదంబుల కొకింత జడియక నొకమాట
లోననె వెయ్యాఱులైన నొసఁగి
గీ. వీటిలో మిడిమేలపు విటుని విధము
సాఁగఁ గొన్నాళ్ళు నిజపితృసంచితంబుఁ
బొల్లుగాఁ జల్లి యదియెల్ల సళ్ళుటయును
దల్లడిల్లుచు దుర్మార్గతల్లజుండు. 675

అచ్చతెనుఁగు
క. బా కడిదము చేకత్తియు
బోకలు నాకులును బూని బుడత గొలువఁగా
మేకొని ఢీకెంచపయను
వాకటు చాలించి యింటివాకిటికవలన్. 676

క. వగదప్పి తిరిగి విఱిగిన
పగిది న్దలవాంచి యెల్లబంధులు దెగడ
న్మొగసాల వచ్చి నిలిచిన
వగసాలక జనని దొడుక వచ్చె న్వానిన్. 677

గీ. ఇంటియిల్లాలిచేఁ దలయంటఁజేసి
మజ్జనము భోజనంబు నమర్చి పిదప
వీడియ మొసంగి సాత్విగ జాడనున్న
కొడుకు తల దువ్వుచును తల్లి నుడివె నిట్లు. 678

ఉ. గట్టులు వేదవిద్యల కగారము శాస్త్రవివాదరూఢికిన్
బుట్టినయిల్లు శీలతకు భూస్థలి నట్టిగృహస్థునందు నీ
యట్టికులైకపాంసనుఁడు నక్కట గల్గునె యాణిముత్యము
ల్బుట్టెడు దామ్రపర్ణి మఱి బుట్టకయున్నదె యోటిగుల్లయున్. 679