పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/257

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క. ఱాబొమ్మకు గిలిగింతలు
నీ బోటిని బేలుపఱచి నేఁ డిదె చుట్టం
బై బమయించెను నన్నున్
సాబాసే బాలవాని సరసకుఁ దీయకే. 630

శా. ఓరామామణి నీదుతోడిచెలు లయ్యె సర్వసౌఖ్యంబుల
న్మీఱ న్నీ వొకఱిత్తగాని వలకు న్మీనంబవై చిక్కితే
శ్రీరామా యని వీనుల న్గదియఁగాఁ జేదోయి గీలించి యె
వ్వారే మౌదురొ తమ్మిచూలి యిటుగా వ్రాసె న్లలాటంబునన్. 631

గీ. నీవిలాసంబు రూపంబు నేర్పు నోర్పు
నడవిలోఁ గాయువెన్నెల లయ్యె నకట
యిట్టిమానిసి యే నిన్ను మట్టు మీఱ
నేలువాఁడు దయ న్నీకు మేలువాఁడు. 632

క. నినువంటివారి నెందఱిఁ
గనుఁ బ్రామినవాఁడొ వీఁడు కటకట నీ చూ
పునకు నితఁ డెట్టివాఁడై
గనుపించెనొ నెట్టివేళఁ గలసితొ వీనిన్. 633

చ. అడిగినఁ దెచ్చువాఁడొ గడునందమున న్గననైనవాఁడొ మే
ల్నడవడికాఁడొ వీటఁ దగు నాయకమై చరియించువాఁడొ చే
విడిముడిగల్గువాఁడొ దలవెండ్రుక లందఱు రాకుమారకు
ల్ముడుపులు వానఁగాఁ గురియ ముట్టవు గారణ మేమి కూఁతురా. 634

ఉ. ఏమని నీకుఁ దోఁచె నిది యేమని యూరకచూచియుందు నే
నేమని యోర్చుదాన నిది యేమని మానుపనేర్తు వీఁడు ని
న్నేమని గారవించె నిది యేమని నీకు సహించె నక్కటా
కోమలి వింతగాక మనకు న్దగునే యిటువంటి చైదముల్. 635

అపూర్వప్రయోగము
క. ఈలాగున వానితో నవు
లాటకుఁ బన్నిదమిడి సొగటా లాడఁగ నో
టాలగు నీ కర్ధేందుని
టాలాయని దక్కగొను కటా లలితాంగీ. 636