పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గీ. పొట్టగీరనగింజలు బొంగరములు
గచ్చకాయలు దాఁగిరి మ్రుచ్చులాట
బంతిమెకమాట జిందర పరపులాట
లనెడు శైశవదుర్వృత్తి నధిగమించి. 613

క. సటలు దటవటలు నటనలు
మటుమాయలు జాటువగల మాటలవింత
ల్గుటిలతయుఁ దెలిసిపాఱుఁడు
విటవిద్యకు బిరుదువేసి వికవిక నగుచున్. 614

క. నిరతముఁ జదరంగంబున
గిరిజలసొగటాల నారికేళఫలములన్
సరిజేసి యొడ్డువిడుపులు
చెఱకులబందె మిడి గెలుపుఁ జేకొని యవలన్. 615

స్వభావోక్త్యలంకారము
సీ. పికిలిపిట్టలును లావుకలు బిచ్చుకలును
గాఱుపుల్గుల జేరి కేరిజములఁ
గైదుల వలిచలఁ గాట్లాట విడుచుచుఁ
గోడిపుంజులుఁ దన్నులాట నిడుచుఁ
బొట్టేళ్ళ సన్నలఁ బెట్టుచు గిజిగాండ్లఁ
బిలుపుదీయుచు జీనువులనుబైటఁ
బారాడఁజేయుచుఁ బారాలపల్లటీల్
గనుఁగొంచు రెయివేఁటలను దిరుగుచుఁ
గీ. దీండ్రవయసెచ్చఁ జేకత్తికాండ్రఁ గూడి
గరడిమాష్టీల జెట్లతోఁ గత్తిసాము
పెనుఁగులాట లొనర్చుచు బేరజంపు
టారజమ్మునఁ గడుగడి దేరఁ దలఁచి. 616

క. మల్లియలు సన్నజాజులు
మొల్లలు సంపెఁగలు మొగలిపూ ల్జేమంతుల్
మొల్లముగను వరుసగ రం
జిల్లెడు బువుదండఁ గోరసిగఁ జుట్టివడిన్. 617