పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/244

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. కలదు లే దనుకొను వలకేలఁ గీలించి
ప్రౌఢ యొక్కతె కాంతఁ దోడి తేగ
జెలువ పావడ నొక్క చెలి గంధగజయాన
చిఱునవ్వు మోముపైఁ జెమటఁ దుడువఁ
గొమ్మ యొక్కతె చాల గుబ్బపాలిండ్లపై
నిసుమంత జాఱు పయ్యెద నమర్ప
మృగనేత్రి యొక్కతె చిగురాకుఁ బొడిమన్
గొప్పునఁ జెదరిన కురులు గూర్ప
గీ. బిత్తరము జిమ్ము చూపుల మొత్త మంఘ్రు
లందు నీలాలయందెల నంద మందఁ
బ్రేమయును సిగ్గు హర్షంబుఁ బెనఁగొనంగ
సరగ నాంచారు మును బెండ్లి చవికిఁ జేరె. 583

ఉపమానాలంకారము
క. నెలవుగఁ జేరిన నచ్చెలి
కెలనన్ దమిమీఱ నిలిచి కేశవుఁ డొప్పెన్
వలరాచయాక మామిడి
సెలగొమ్మను పండుడాయు చిలుకయుఁ బోలెన్. 584

క. అంతట భూసురకామిను
లంతంతను వివిధభూషణాలంకృతలై
వింతలుగ మణుల నారతు
లెంతయుఁ బళ్ళెరములందు నిడికొని వేడ్కన్. 585

సకలయమకము — అపూర్వప్రయోగము
ఉ. వాలుమెఱుంగు మేని జిగివాలు చొకాటపు నూగుటారు మేల్
వాలుగడాలు రాయనిరవాలు మిటారపుఁ బల్కు చందు సాఁ
బాలు నొస ల్ప్రసూనముల వాలు వరాళులు చూపు నెమ్మి బల్
వాలుకచంబునొ చెలియ వాలుగ నీయురవాలు నయ్యెడన్. 586

వ. అనుచు ననిచిన మనమ్ముల. 587