పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/241

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మందాక్షియై యున్న నక్కన్నియను జెంతనున్న పుప్పొడిదిన్నెను వసింపన్ జేసి సంపంగినూనె నించిన రతనంపుగిన్నియఁ గర్పూరతాంబూలంబులు వికుచఫలంబులు శోభనాక్షతలు కుంకుమరసంబునఁ గదింబించిన పచ్చిపసుపునలుంగు నమర్చి బంగరుపళ్ళెరం బెదుట నుంచి దీవించి నుదుట నక్షతలు గీలించి కుఱంగటను నైదువలు పాటలు పాడ వేడుకమీఱ నప్పుడు. 569

మ. అలకల్ చిందులు ద్రొక్కఁ గొను వడకన్ హారాళి నర్తింపఁ జె
క్కులు ఫాలంబుఁ జెమర్పఁ బైఁట యెద వీడ్కోల్ జెంద బంగారుగా
జులు టోకివ్వఁగ నూర్పు లెచ్చఁ దరులచ్చోనిక్కుఁ దాళస్థితిన్
దలయంటెం గనుదోయి సొక్క నొకకాంతామౌళి మంగాంబకున్. 570

క. పల్లవపాణులు కొందఱు
బళ్ళెరములఁ బూని ఱవలబంగరుగాజుల్
ఘల్లురన సుంకుఁ జెరిగిరి
యల్లోనేరేడటంచు నయ్యిందిరకున్. 571

చ. అటునిటు జిక్కుగొన్నకుఱు లందముగాఁ గొనగోళ్ళ దువ్వి మి
క్కుటముగ నూనెఁ బో నెడను గొజ్జెఁగి నీరునఁ దోఁచిరాచి యొ
క్కట నిరువాయఁగాఁ బిడిచి గొబ్బున విప్పి కదల్చి చందనం
బటకలిఁ బ్రామె నొక్కకుటిలాలక యంబరరాజు పట్టికిన్. 572

చతుర్విధశృంగారము
సీ. జలక మార్చి మడుంగు జిలుఁగు దువ్వలువను
దడి యొత్తి చిత్రవస్త్రంబు గట్టి
మనసార కుంకుమకర్దమం బొకపాటి
నెఱిపూఁత గాఁగ మైనిండ నలది
తలపెచ్చ మొగలిఱేకులు కొంత గానరాఁ
గీల కొప్పొకవంక గీలుకొలిపి
యాపాదమస్తకం బఖిలభూషణమణీ
హారవల్లరులచే ననువు పఱచి
గీ. కాంత లీరీతిఁ జతురశృంగారగతులు
నలరి గైసేయ నొకవింత నెలువు గాంచి
మదనసామ్రాజ్యలక్ష్మి నాఁ బొదల మిగుల
సార రుచిమించు నాంచారు సౌరుఁ జూచి. 573