పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxiii


గ్రొత్తలు పుట్టించుకొని లిఖింపఁగా...మహిమగాంచి’ యుండెను. సమకాలిక రాజస్థానములలో కవితా గోష్ణులలో ప్రసిద్ధములగు నూతన కవితా రీతులు దేశమందు పర్వుటకు ఒక్కొక్కప్పుడు చాలకాలము పట్టదు. ఆంధ్రకవితక్రొత్త పోకడలు పోవుకాలమది. తిక్కనవంటివాఁడే కేతన సాహచర్యముచే షష్ఠ్యంతములను గ్రహించి వానికొక నూతన స్థానమేర్పఱచిపోయినాఁడు. అంకితముల పద్దతియు మారినది. అప్పుడే కాకతీయ రాజధానియందు కవులును ఆలంకారికులును సంస్కృత మర్యాదల ననుసరించి అష్టాదశవర్ణనలను పేర్కొనిరి. నానారాజ సందర్శనము చేయు నమాత్యులకు కవిత్వమొక వినోదకరణము.

  'అని మీతండ్రి మహత్వము | జనవినుత రసప్రసంగ సంగతకవితా
   ఘనతేజులు కవిరాజులు | గొనియాడుదు రఖిలరాజకుంజర సభలన్'

అని జక్కన తండ్రినే పొగుడువారు. తాతను పొగడకుందురా? తెనుఁగున ప్రబంధ పద్దతి కీతఁడే జనకుఁడేమో: నాటి కాకతీయ శాసన వాఙ్మయ మీ విషయమును ఊర్జితము సేయుచున్నది.

సమకాలిక కాకతీయ సామ్రాజ్యమందలి శాసనకవులలో క్రీ.శ.1277 నాటికి ఈశ్వరభట్టోపాధ్యాయుఁడు లేక ఈశ్వర సూరి యనునాఁతడు చిత్ర బంధాదికవి కనఁబడుచున్నాఁడు. ఈయన రచించిన శాసనములు మూఁడు, క్రీ. శ. 1259, 1272, 1279 నాటివి మల్యాల వంశస్థులవి. బూదపూరు, (మహబూబునగరు) లో దొరికినవి. (Hyderabad Archaeological Series No 13-Inscriptions no 52, 51, 50).

'...మల్యాల గుండదండాధీశ్వరుండు మంత్రిపురోహిత సేనాపతి దేవారిక మహా ప్రధానానంతసుభట విషవిదూషక పాఠక పీఠమర్దనట నర్తక రసిక రంజక కవిగమకి వాది వాగ్మివందివైతాళిక హావకభావక గాయకాద్యనేక విద్వజ్జనంబులుం గొలువ సుఖోపవిష్ణుండై యిష్ట కథావినోదంబులనుండి పాణినీయ వ్యాకరణ విచిత్రకవిత్వతత్త్వజ్ఞుండును పద క్రమయుత యజుర్వేద పారగుండును నాత్రేయగోత్ర పవిత్రుండును మయూరార్య పుత్రుండును నైన యీశ్వరసూరిం గారుణ్యదృష్టిం జూచి...'

శాసనమేమో తెనుఁగే శ్లోకములు మాత్రము సంస్కృతము. చిత్ర కవిత. ఈ శ్లోకములకు ముందు ఇట్లు నిర్దేశించినాఁడు -'నిర్దంతము-ఆర్యా గర్భము-క్రియా పదభ్రమకము, పునరుక్తాభాస, పాదాదియమకము, క్రియా