పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముద్రాలంకారము - త్రిపుట - మానినీవృత్తము
మానిని. నిబ్బరమైనది నెక్కొను వేదన నిల్పఁ దలంపుచు నేర్పులచే
నబ్బుర మంద రయాన కొనర్చిన వన్నియు నిష్ఫల మౌచునుబో
నుబ్బినకాఁకకు నోర్వక ఱెప్ప లటొయ్యన వ్రాల్చుచు నుస్సురనన్
గబ్బిసఖులు తటకాపడి మానినిఁ గన్గొని పల్కిరి కర్ణముగాన్. 536

ఆర్తి
ఉ. కాఁక శమింపఁజేతు మనఁగాఁ గలకంఠరవంబు వీనులన్
సోఁకిన గుందె గాడ్పు మెయిఁ జొచ్చుట గొందల మందె నంతలో
వ్రేఁకపుఁ జిల్కపల్కువడి వేఁడిమి రాయిడి నొందె మార న
ఱ్ఱాఁకలఁ జెందెనెట్లు చెలియన్ వడజేర్చెదమంచు నెంచుచున్. 537

సీ. వనితగన్గవ నొత్తి వైచిన గలువపైఁ
గరమాని రేఱేని యురువు గందె
మగువ చేనిడి త్రోయు చిగురాని నాలుక
పొక్కపస్వరమునఁ బొగలెఁ బికము
పడఁతి యంఘ్రులనుంచి కడకుఁ ద్రోచిన తమ్మి
విరిసోఁకి సుడివడి తిరిగెఁ బవన
మువిద చంటనుఁ జేర్చి యవలఁబో మీటిన
సుమగుచ్ఛముల వ్రాలి కమలెఁ దేఁటి
గీ. భామ బాహుల నిల్చి త్రోఁబడిన తూఁడుఁ
గమిచి రాయంచ పద్మాకరమున దుమికె
వేగఁ గపురపుహారంబు విరియబాఱె
వెలఁది నెమ్మేని విరహాగ్నివేఁడి ననుచు. 538

అత్యుక్త్యలంకారము
చ. కొలని కెలంకులన్ జెలులు కోమలి నిల్పిన మేనికాఁకచే
సలసలఁగాఁగె నీళ్ళు జలజంబులు సుక్కెను దానఁ జిక్కితేఁ
టులు మొఱఁ బెట్టుచున్ గమలె డుక్కె బిసంబులు వ్రీలెఁ బత్రముల్
గలువలు వాఁడెఁ బుప్పొడులు కగ్గెఁ దొలంగెను జక్రవాకముల్. 539