పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిండుమెఱుంగుఁ బూనినమోముఁ దమ్మిపైఁ
బొందుగా నుదురు లేజందు నిలిపి
వెలిబర్వు చిఱునవ్వు వెన్నెల నిగ్గుపై
నురుతరాక్షి చకోరయుగము నిలిపి
గీ. నిజబలాన్యోన్యవైరంబు నిగ్రహించి
కాయజుఁడు నేర్పు చేఁగూర్చెనో యనంగ
నిద్దపుఁ బసిండి నెత్తమ్మి మిద్దెనడుము
మొలచిన నెలంత తలమిన్న నిలువు దనరె. 489

ద్విరుక్తికందము
క. నకనకని నడుము నక్కులు
చకచకల వెలార్చుతొడలు జక్కనితొగలన్
వికవికనగు తెలిగన్నులు
వికచకమలవదన కొనరె వేడుక మీఱన్. 490

క. తిలకంబు ములికి నాసాం
చల కాంచన శరగృహీతశార్ఙ్గంబును బొ
మ్మల కోపుల వ్రే ల్తెలి జ
ల్లు లనఁగఁ జెక్కుల నగవు తళుకమరె రమకున్. 491

విభావనాలంకారము — అపూర్వప్రయోగము
సీ. ఒదవుఁబో నొకచక్కిఁ గదళికాస్తంభంబు
లాపయి నిసుముది బ్బరిది గాదె
మొలుచుఁ బో నొకమేరఁ దళుకు దొంతరకర
ళ్ళాపయి గుబ్బలు లరిది గాదె
గలుగుఁబో నొకచెంతఁ గనకారవిందంబు
లాపయిని బిసమ్ము లరిది గాదె
బుట్టుఁబో నొకచోటఁ బున్నమచందురుఁ
డాపయి నిరు లుంట యరిది గాదె