Jump to content

పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆద్యంతైకనియమముక్తపదగ్రస్తనిస్తులకందము
క. ఈలేమ మోవిచెఱకుం
బాలె బాలేందుతీరుఫాలపు మేలే
మేలే జిగి గుదిరికి జగ
డాలే డాలేపురుషుని డాలే గన్నుల్. 462

ఆద్యంతైకనియమముక్తపదగ్రస్తచక్రవాళసీసము
సీ. తరము గుబ్బలు ధరాధరము గేరఁగఁ గోరు
గోరముత్యము గెల్వ బారు దీఱు
దీరుగాఁ జీమచాల్ వారించు నూగారు
గాఱుమబ్బును గెబ్బుఁ గబరిసౌరు
సౌరుచ్యమున మోవిచవి తేనె వగ నూరు
నూరు లంటుల మీఱి దారి తారుఁ
దారుణ్య మబ్జజాకారము పై దూరు
దూరునెమ్మోము చందుపలుమాఱు
గీ. మారుతేజీల నగఁ బల్కుఁ బోరువారు
వారిరుహముల బదములు మేరజీరు
జీరుపల్జిగి మగఱా మిఠారి పేరు
పేరుగల కన్నె నెన్న నెవ్వారి తరము. 463

తే. మంచిగంధంబుఁ గనుట సంపంగి యగును
మేలియంశుక మానుట మేలిమియగు
రెంటగలుగు సమాఖ్యమైనంటి యుండె
గనుక కనకాంగి యనుట యీకలికి కలరు. 464

సార్వత్రికనియమకతత్పూర్వోపరియమకరూపనియమకద్వయఘటకవృత్తము
ఉ. మించును జూపు చూపు విరి మించుఁగ నవ్వును నవ్వు యాన మ
మ్మించును నెమ్మి నెమ్మిజడ మించును దాచును దాచు గోరు రె
మ్మించును దారదార గతి మించును నంచల నంచ గుబ్బ న
మ్మించును చెండు చెండును భ్రమించు నను న్గొమ రూపు బాపురే. 465