పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లాటీరీత్యుదాహరణోపమాలంకారము
తే. పదము లంబుజభవకాంతిఁ బరిఢవిల్లు
గుబ్బ లచ్యుతదీధితి గ్రుమ్మరించు
కబరి నీలకంఠద్యుతిఁ గాంచుఁ గాన
యలరుమేల్మంగకన్న సాములు గలారె. 416

శ్లేషరూపవైదర్భీరీతిభేదవృత్తము
ఉ. ఆజగడాలు మోముసొగ సాతెలిగన్నుల కోపుచూపు తీ
రాజిగిఠీవిమోవిపలు కానునుగొప్పుమెఱుంగుసోయగం
బాజవసందులే నిఱుకుఁజన్నులు సిబ్బెపుటుబ్బు గబ్బిసౌ
రాజవరాలికే తగు నయమ్ముగ నబ్జదళాయతేక్షణా. 417

ఉ. ఆ లలితాంగి యావెలఁది యాజిగి తానక మాపడంతి యా
బాలిక యామెఱుంగు విడిపాళెము యా చిగురాకుఁబోఁడి యా
గోల మిఠారి యాకులుకుగుబ్బెత యాకలకంఠి యా
మేలిమిబొమ్మ యాకలికిమిన్న తలంపఁగ స్వామికే తగున్. 418

అనుప్రాసద్వయమధ్యయమకవృత్తము
చ. అరికుచ తావిమోవి తొగరాతొగ రాచమొగంబు డంబునా
యరవిరి తేనెసోన పలుకా బలుకాకల చెన్నుపొన్నుతో
సరియగు మేనునైన ఘనమా ఘన మాస్థితి నొప్పుకొప్పు నా
యరివికఁ జూపు చూపు మెఱుఁగా మెఱుఁ గారయ నెన్నశక్యమే. 419

ద్విపాదపంచమవర్ణయమకము
క. బాలికసిబ్బెపుగుబ్బలు
తాలసమానములు కుటిలతాలసమానం
బాలేమ తళుకు కురు లా
బాలేందుఁడు ముదిత నుదురు పద్మదళాక్షా. 420

శబ్దచిత్రము
క. కొమ గుబ్బలతోఁ బోర న
గములా వృద్ధిఁ గని యూరుగమనములకు లో
గి మొదట పుంభావంబై
క్షమ పొక్కిలి కోడె గతులు గలుగని కతనన్. 421